నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుందన్నారు. కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్స్టర్లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు కుమిలిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి ఇటీవల ఓ మహిళా అధికారితో దురుసుగా ప్రవర్తించారు. మీడియా వారిని కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాల్ రికార్డులు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి. వారిద్దరిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు వారిద్దరినీ ఆనం టార్గెట్ చేయడం వెనుక చాలా కథ నడిచినట్టు నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాజా ఇన్స్టిట్యూషన్స్ను ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది. దీంతోపాటు వేణుగోపాల స్వామి ఆలయ భూముల అంశాలను కూడా ఆనం కుటుంబంమే చూస్తోంది. అయితే, తాజాగా వెంకటగిరి రాజా ఇన్స్టిట్యూషన్స్లో అభివృద్ధి కమిటీని నియమించారు. ఆ కమిటీ బాధ్యతలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అప్పగించారు. దీంతో అప్పటి వరకు తమ చేతుల మీదుగా నడిచిన వీఆర్ ఇన్స్టిట్యూషన్స్ తమ చేజారిపోతున్నాయని ఆనంకు అర్థమైంది. దీంతోపాటు వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.రవీంద్రా రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలతోనే ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
జిల్లాకు సంబంధించిన అంశాలపై జగన్‌ను కలిసేందుకు ఆనం రామనారాయణరెడ్డి ప్రయత్నించారని, అయితే, సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం. ఈ క్రమంలో మీడియా ముందే పరోక్షంగా తన ఆగ్రహం మొత్తం వెళ్లగక్కారు ఆనం. అయితే, ఆనం మీద జగన్ సీరియస్ అయ్యారు. పార్టీలో ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలి కానీ, మీడియా ముందుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వివరణ కోరుతూ ఆనంకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.