(G.SrinivasaReddy,News18,Khammam)
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రాజకీయం గోవా సముద్ర తీరానికి చేరింది. ఇప్పటికే కొన్ని రోజులుగా అక్కడి రిసార్టుల్లో తెరాసకు చెందిన ప్రజా ప్రతినిధులు సేద తీరుతున్నారు. వివిధ స్థానిక సంస్థలకు చెందిన మేయర్లు, ఛైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సెలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇంకా ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉన్న వారిని అందరినీ దశలవారీగా క్యాంపునకు తరలించారు. ఖమ్మం నగరానికి చెందిన కార్పోరేటర్లు అందరినీ ఒక ప్రత్యేక విమానంలో తరలించగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ప్రత్యేక బస్సుల్లో తరలించారు. వీరికోసం సకల సౌకర్యాలున్న రిసార్టుల్లో ఏర్పాట్లు చేశారు. క్యాంపు ఇన్ఛార్జులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ ఏం కావాలన్నా క్షణాల్లో అందేలా ఏర్పాట్లు చేశారు.
ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎవరూ డిస్టర్బ్ కాకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార తెరాస పార్టీకి చెందిన సుమారు ఆరొందల మంది ప్రజా ప్రతినిధులను ఇప్పటికే గోవా తరలించారు. వీరిపై ఎలాంటి ఇతరత్రా ప్రభావం పడకుండా చూడ్డానికి ప్రతి పదిమందికి ఒక ఇన్‌ఛార్జిని నియమించినట్టు చెబుతున్నారు. రైతుబంధు రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న క్యాంపునకు తెరాసకు చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఇంకా బాధ్యులైన వారంతా హాజరై తమ పరిధిలోని స్థానిక ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఓటు ఎలా వేయాలి. క్యాంపు నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే దాకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సైతం శుక్రవారం ప్రత్యేకంగా అక్కడికి బయలుదేరి వెళ్లారు.
వాస్తవానికి ఆయన కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సాహం, పెట్టుబడులకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతున్నారు. పనిలో పనిగా స్థానిక ప్రజప్రతినిధులకు చెందిన క్యాంపును కూడా సందర్శించనున్నట్టు చెబుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో బాటుగా ఈ క్యాంపులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు హాజరై తమ పార్టీ ఓట్లు క్రాస్ కాకుండా చూసుకోడానికి కసరత్తు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్యాంపు రాజకీయాల్లో ధిట్టలైన నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి తాతా మధుసూదన్ విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాయమేనన్న ధీమా తెరాస వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన క్యాంపును మారేడుమిల్లిలో ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా వందకు పైగా ఓటర్లను శిబిరానికి చేర్చినట్టు చెబుతున్నారు. అయితే తెరాసలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ తమకు ఏదోలా మేలు చేస్తాయన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. తెరాసను మినహాయించి లెక్కిస్తే అన్ని పార్టీలు కలిసినా గెలుపు సాధ్యం కాదు. కానీ తెరాసలోని ప్రధాన నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు తమకు ఉపకరిస్తుందన్న నమ్మకం వారిలో ఉన్నట్టు చెబుతున్నారు. వర్గాలుగా చూసుకుంటే తెరాసలోని ప్రతి వర్గానికి కనీసంలో కనీసం వందకు పైగా ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. పేరుకు అందరూ ఒకే క్యాంపులో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఓటు దాకా వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న మీమాంస ఉంది.
దీనికితోడు తెరాసలో స్థానికేతరుల, జిల్లాకు చెందని నేతల పెత్తనం నడుస్తోందన్న ప్రచారం సోషల్‌మీడయాలో సాగుతోంది. దీంతో ఊహించినంత ఆరోగ్యంగా పరిస్థితి కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న రాయల నాగేశ్వరరావుకు మంచి పేరుండడం, సామాజికవర్గ పరంగా, వ్యాపార పరంగా మంచి పేరుండడం.. దాదాపు ఓటర్లు అందరితో టచ్‌లో ఉండడం కలిసొచ్చే అంశాలు.
ఇంకా ఎంపీటీసీల సంఘం తరపున బరిలో దిగటిన కొండపల్లి శ్రీనివాసరావు కొన్న ఓట్లను చీల్చే పరిస్థితి ఉంది. ఇక ఆదివాసీల ఆత్మగౌరవం పేరిట బరిలోకి దిగిన కొండ్రు సుధారాణికి వందకు పైగా ఉన్న ఆదివాసీల ఓట్లు పడితే తెరాసకు గండిపడినట్టే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే తెరాస అభ్యర్థి తాతా మధుసూదన్ విజయానికి పల్లా రాజేశ్వరర్‌రెడ్డి సహా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇంకా పలువురు నేతలు వ్యూహాలు సిద్ధం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.