బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ సీఎం అవుతారన్న ఎగ్జిట్ పోల్ అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. ఆర్జేడీ కంటే ఒక్క సీట తక్కువగా తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచింది. ఐతే బీహార్‌లో అసదుద్దీన్‌కు చెందిన ఎంఐఎం పార్టీ సత్తా చాటి సంచనల సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు స్థానాలు గెలిచి అందరికీ షాకిచ్చింది.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే సీమాంచ్లో ఎంఐఎం సత్తా చాటింది. ఆమోర్ నియోజకవర్గంలో అక్తరుల్ ఖాన్, బైసిలో సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్, జోకిహాట్‌లో షానావాజ్ ఆలమ్, కోచధామమ్లో మహమ్మద్ ఇజార్ అఫ్సి, బహదూర్ గంజ్‌లో మహమ్మద్ అంజార్ నయీమీ విజయం సాధించారు. ఆమోర్లో ఎంఐఎం పార్టీ 52,515 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక బైసిలో 16,373, కోచధామమ్లో 36వేల ఓట్లు, బహదూర్ గంజ్‌లో 45,215, జోకిహట్లో 7,383 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. ఎంఐఎం అధినేత ఓవైసీ నివాసినికి వెళ్లి ఆయన్ను కలిశారు. తమకు టికెట్ ఇవ్వడంతో విజయానికి కృషి చేసినందుకు గాను స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
కాగా, 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో.. ఎన్డీయే 125 సీట్లు సాధించింది. మహాకూటమి 110 సీట్లు దక్కించుకుంది. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4, CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి. మ్యాజిక్ మార్క్ 122 కంటే మూడు సీట్లు ఎక్కువ గెలవడంతో.. ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నితీష్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముంది.