హోమ్ /వార్తలు /National రాజకీయం /

AP Municipal Election Result: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్: సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థులను ఊటీకి తీసుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి: చైర్మన్ పదవిపై వైసీపీ ఫోకస్

AP Municipal Election Result: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్: సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థులను ఊటీకి తీసుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి: చైర్మన్ పదవిపై వైసీపీ ఫోకస్

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాశాయి.. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ గెలుపొందింది. కానీ ఒక్క తాడిపత్రిలోనే చైర్మన్ పదవి సొంతం చేసుకునేంత మెజార్టీ వచ్చింది. అయినా ఆ పదవిపై వైసీపీ కన్నేసిందని స్థానిక టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చదవండి ...

  అనంతపురం జిల్లాలో టీడీపీ ఖాతాలో చేరింది ఒకే ఒక్క మన్సిపాలిటీ తాడిపత్రి.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినా టీడీపీ బోణీ కొట్టింది ఇక్కడే. తాడిపత్రితో పాటు మైదుకూరులో మాత్రమే టీడీపీ గెలుపొంది. మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసింది. అయితే మైదుకూరులో బోటా బొటా మెజార్టీతో టీడీపీ విజయం సాధించడంతో అక్కడ చైర్మన్ పదవికి దక్కించుకోవడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఇక టీడీపీ చైర్మన్ పదవిపై ఆశపెట్టుకున్నది ఒక్క తాడిపత్రి మాత్రమే.. అయితే అక్కడ కూడా ఆ పదవి కోసం వైసీపీ కన్నేసిందని స్థానిక టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

  తాడిపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందింది. అయితే సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దీంతో ఆ రెండు కూడా తమవే అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంటే మొత్తం తాడిపత్రిలో 20 సీట్లు రావడంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టే.. ఎక్స్ అఫిషియో సభ్యుల అవసరం లేకుండానే టీడీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అయినా టీడీపీలో ఆందోళన తప్పడం లేదు.. అధికార పార్టీ ఇప్పటికే.. తమ పార్టీ తరపున గెలిచిన వారికి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

  తనతో పాటు నెగ్గిన టీడీపీ అభ్యర్థులతో పాటు, సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థులను సైతం క్యాంపునకు తరలించారు. మొత్తం అందర్నీ ఊటికి తరలించినట్టు తెలుస్తోంది. తనను చైర్మన్ గా అవ్వకుండా అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఆయన పూర్తిగా అలర్ట్ అయ్యారు. ప్రజల కోసం అందరినీ కలుపుకుని పోతానని టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిపై ప్రేమతోనే వాళ్లు తమను గెలిపించుకున్నారన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు తానే ధైర్యమని.. తనను చూసే గెలిపించారన్నారు. జేసీని నమ్మారన్నారు. ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఈ గెలుపు తాడిపత్రి ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. పదిరోజుల తర్వాత మున్సిపల్ ఆఫీసులో కూర్చుని ప్రజలకు అన్నీ చెబుతానని, ఏముంది.. ఏం చేయగలమో అన్నీ చెబుతామన్నారు. ప్రతి విషయంలో అందరినీ కలుపుకుపోతానని, ఎమ్మెల్యేను సైతం కలుపుకుని పోతామన్నారు. తనకు ఏదీ అవసరం లేదని, 365 రోజులు.. 24 గంటలు ప్రజల కోసం పని చేస్తానన్నారు. తాడిపత్రి ప్రజల కోసం ఎంత తగ్గాలో అంత తగ్గి పని చేస్తానని... సేవ్ తాడిపత్రి అనే పదం... ప్రజల్లో నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు.

  ఆయన అనుకున్నట్టు అన్నీ సవ్యంగా జరిగితే చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం జేపీ ప్రభాకర్ రెడ్డికి రెండోసారి అవుతుంది. గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేపీ ప్రభాకర్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఏపీలో తాడిపత్రి మున్సిపాలిటీకి ఆయన చైర్మన్ గా పని చేశారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్నారు.

  ఇక ఒక్క తాడిపత్రిని పక్కన పెడితే.. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ స్పీడ్ గా దూసుకుపోయింది. జిల్ల వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. అనంతపురం కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలు 02 నగర పంచాయతీలు ఉంటే.. అనంతపురం కార్పోరేషన్ మొత్తం ఏకగ్రీవం అయింది. అనంతపురం కార్పొరేషన్ మొత్తం స్థానాలు 50 ఉండగా, వైసీపీ 48, టీడీపీ 0, ఇండిపెండెంట్ 2 స్థానాల్లో గెలుపొందారు. ఇక ధర్మవరం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 30 ఉండగా, వైసీపీ 30 గెలుపొందింది. గుత్తి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 19 ఉండగా, వైసీపీ 18, టీడీపీ 1 చోట గెలుపొందింది.

  గుంతకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, వైసీపీ 25, టీడీపీ 7, సీపీఐ 1 స్థానంలో ఘన విజయం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 38 ఉండగా, వైసీపీ 29, బీజేపీ 1, టీడీపీ 6, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచింది. ఇక కదిరి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 36 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 5, ఇండిపెండెంట్ 1 స్ధానంలో విజయం సాధించింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 24 ఉండగా, వైసీపీ 19, టీడీపీ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించింది. మడకశిర మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండా, వైసీపీ 15, టీడీపీ 5 స్థానాల్లో గెలిచింది. పుట్టపర్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండగా, వైసీపీ 14, టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. రాయదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 32 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వైసీపీ జోరుకు తిరుగు లేకుండా పోయింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, CPI, Jc prabhakar reddy, Municipal Elections, TDP, Ycp

  ఉత్తమ కథలు