TENNIS PLAYER LEANDER PAES JOINS TMC IN THE PRESENCE OF BENGAL CM MAMATA BANERJEE PRV
Leander paes: రాజకీయాల్లోకి లియాండర్ పేస్.. ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీలోకి చేరిన టెన్నిస్ దిగ్గజం
లియాండర్ పేస్ (Photo: India_AllSports/Twitter)
లియాండర్ పేస్ టెన్నిస్ ఆటగాడిగా భారత్‌కు మరుపురాని విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టెన్నిస్ ప్లేయర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పార్టీ కండువా కప్పుకున్నారు.
టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ (Leander paes) శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సమక్షంలో పేస్ టీఎంసీ (TMC) కండువా కప్పుకున్నారు. అలాగే, బాలీవుడ్ నటీమణులు నసిఫా ఆలీ, మృణాలిని దేశ్ ప్రభులు కూడా తృణమూల్లో జాయిన్ అయ్యారు. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్న టీఎంసీకి పేస్ చేరిక ఆత్మవిశ్వాసం నింపింది. లియాండర్ పేస్ చేరికను పశ్చిమ బెంగాల్ (west Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. లియాండర్ పేస్ చేరికను దీదీ స్వాగతిస్తూ.. పేస్ తనకు సోదరుడి వంటి వాడని పేర్కొన్నారు. తాను యువజన సర్వీసుల మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేస్‌తో పరిచయం ఉందని, అప్పుడతను చాలా చిన్నవాడని పేస్ టీఎంసీలోకి రావడం తనకు సంతోషంగా ఉందని దీదీ తెలిపారు.
రాజకీయాలనే వాహనం ఎక్కి..
లియాండర్ పేస్( Leander paes) మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను టెన్నిస్ నుంచి రిటైరయ్యాను.. రాజకీయాలనే వాహనం ఎక్కి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను.. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.. దీదీ నిజమైన ఛాంపియన్’ అని పేస్ వ్యాఖ్యానించారు. క్రీడా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మమతా బెనర్జీ పనితీరును ఈ సందర్భంగా పేస్ ప్రశంసించారు. లియాండర్ పేస్ తమ పార్టీలో చేరిన విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీలో చేరారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది తృణమూల్ కాంగ్రెస్. ఈ దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి 2014 నుంచి ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్యం కోసం కలిసి పనిచేస్తాం అని తెలిపింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో..
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీఎంసీ వ్యూహా రచన చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీని ఢీకొట్టే సత్తా మమతకు మాత్రమే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, విపక్షాలను ఏకతాటి పైకి తీసుకొచ్చి, శక్తివంతమైన బీజేపీని ఎదుర్కొవడం అంత సులువు కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
బెంగాల్లోనే జననం..
లియాండర్ పేస్ 1973 జూన్ 17 కోలకతాలో జన్మించాడు. డేవిస్ కప్ లో డబుల్స్ లో అత్యధిక సార్లు విజేతగా అతని పేరిట రికార్డు ఉంది.పేస్ ఎనిమిది సార్లు డబుల్స్, పది సార్లు మిక్స్‌డ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. 1990 లో అర్జున అవార్డు అందుకున్నాడు. 1996-97 లో భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నాడు. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 2014 లో టెన్నిస్ కు భారతదేశంలో ప్రాచుర్యం కల్పించినందుకుగాను పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.