Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)కి ఇటీవల కష్టకాలం నడిచింది. నేతలు దూరమవడం, కార్యకర్తలు బెదిరిపోవడంతో కాస్త నిస్తేజం నెలకొంది. ఐతే ఇటీవల జరిగిన పరిణామాలతో పార్టీలో కాస్త ఊపొచ్చిందని కేడర్ లో చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి (Attack on TDP Office) జరిగిన తర్వాత చంద్రబాబు స్పందన, నేతల సంఘీభావం తెలపడం, కార్యకర్తలు తరలిరావడంతో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న సంకేతాలు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సూన్యత ఏర్పడింది ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రజల లోకి అంతగా తీసుకువెళ్ల లేకపోయారు. దీంతో పాటు సీనియర్ నాయకుల జంపింగ్ జపాంగ్ నేతల ఆటలు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల చేష్టలతో తలపట్టుకున్న చంద్రబాబుకి తాజా పరిణామాలు ఊతమిచ్చాయని చెప్పుకుంటున్నారు.
సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషించడం వల్లే తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని వైసీపీ నేతలు స్వయంగా సమర్ధించుకున్నారు. ఈ దాడి తరువాత జరిగిన పరిణామాలు కూడా ఎంతో ఆసక్తికరంగా సాగాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా నన్ను మా అమ్మను అసభ్యకరంగా దూషించారంటూ బహిరంగంగా వాటి అర్ధాలను కూడా వివరించారు. అలా తిట్టడం వల్లే తమ పార్టీ అభిమానులు సహనము కోల్పోయారని సీఎం చెప్పిన కొద్దిసేపటికే టీడీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై దీక్ష పేరుతో నిరసనకు పిలుపునిచ్చింది.
ఐతే పలువురు వైసీపీ నేతలు టీడీపీ అభిమానులతో దాడి చేయించుకొని సానుభూతి పొందాలనుకుంటున్నారేమోనని ఆరోపణలు చేసినా.. స్వయంగా సీఎం జగనే తమ అభిమానులే బీపీ వచ్చి దాడి చేసి ఉండొచ్చని చెప్పడంతో బాబు చేపట్టిన దీక్ష విజయవంతమైందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. రెండున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నా రాని మైలేజ్ ఈ దీక్షతో వర్కవుట్ అయిందని బాబు కూడా భావిస్తున్నారు. అందుకే దీక్ష ముగిసిన తర్వాత ఆయన మోములో నవ్వులు కూడా కనిపించాయంటున్నారు పలువురు నేతలు.
ఇక చంద్రబాబు దీక్ష ముగింపు సందర్భంగా కేసుల సంగతి నేను చూసుకుంటా.. మీరు పోరాటం చేయడంటూ నేతలు, కార్యకర్తలకు పిలుపునిన్వడంతో కేడర్ కు భరోసా ఇచ్చినట్లైంది. ఇక ఢిల్లీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ తీరును అక్కడి పెద్దల దృష్టికి తీసుకెళ్లడం, అనుచిత వ్యాఖ్యలు, దాడుల విషయాలను వెల్లడించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ పార్టీపై నమ్మకం పెరుగుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన కొన్నిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనా.. తమకు వచ్చిన సానుభూతిని రెండున్నరేళ్లపాటు నిలబెట్టుకోవడం పార్టీకి సవాల్ గా మారే అవకాశముందనే నేతలు కూడా లేకపోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP