TELUGU DESHAM PARTY SENIOR LEADER PADALA ARUNA QUITS PARTY BLAMING NARA CHANDRA BABU NAIDU FOR NOT GIVING IMPORTANCE IN PARTY PRN
Telugu Desham Party: చంద్రబాబుకు మరో షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై.. బీజేపీ వైపు చూస్తున్నారా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి (Telugu Desham Party) మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇప్పుడు మరో ముఖ్యనేత పార్టీకి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. ఇప్పుడు మరో ముఖ్యనేత పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత పడాల అరుణ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. ఆవిర్భావం నుంచే టీడీపీలో ఉన్న ఆమె నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలంగా పడాల అరుణ పార్టీ అధిష్టానం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశంలో గుర్తింపు లేనందునే పార్టీ వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఐతే ఏ పార్టీలో చేరే అంశాన్ని మాత్రం అరుణ ప్రకటించలేదు.
అధికారంలో లేకపోయినా తాను పార్టీకి విధేయురాలిగా పనిచేశానని.. కానీ చంద్రబాబు మాత్రం తనకు గుర్తింపు ఇప్పడం లేదని పడాల అరుణ తెలిపారు. పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. కనీసం ముఖ్యమైన సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదని ఆమె తెలిపారు. తాను అసలు పార్టీలో ఉన్నానో లేదో అర్ధం కాని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. పార్టీ తనను పూర్తిగా మర్చిపోయిందన్న ఆమె.., ఇకపతై వారికి తన అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. 33 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నందుకు అన్యాయం చేస్తున్నారని అరుణ వాపోయారు. రామతీర్థం వచ్చిన సమయంలో చంద్రబాబును కలిసినా సరిగా మాట్లాడలేదని.., చేద్దాం.., చూద్దామంటూ అయిష్టంగా సమాధానం చెప్పినట్లు అరుణ విమర్శించారు.
బీజేపీలో చేరుతారా..?
టీడీపీకి రాజీనామా చేసిన పడాల అరుణ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భేటీ అయ్యారు. పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. ఐతే కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అరుణ తెలిపారు.
తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అరుణ విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఐతే 2009 ఎన్నికల తర్వాత ఆమెకు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా జిల్లాల్లోని కీలక నేతలంతా వైసీపీ, బీజేపీల్లో చేరడంతో కొన్ని చోట్ల టీడీపీ బలహీన పడింది. కీలక నేతలు పార్టీని వీడుతున్నా చంద్రబాబు వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదని కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు.