ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల రాజకీయంపై దుమారం కొనసాగుతోంది. ఓ వైపు ఎస్ఈసీ., మరోవైపు ప్రభుత్వం ఎవరి వాదనతో వారు ముందుకెళ్తుండటం, మధ్యలో ఉద్యోగ సంఘాలు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఎన్నికల ఎపిసోడ్ లో ఉద్యోగ సంఘాల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిమ్మగడ్డ వర్సెస్ ఉద్యోగ సంఘాల వార్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వెంకట్రామిరెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని.., ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా.., వైసీపీనేతగా హడావిడి చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిథి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
2014లో ముషీరాబాద్ నుంచి పోటీకి యత్నం..
వెంకట్రామిరెడ్డి భార్య శ్వేతా వెంకట్రామి రెడ్డి పక్కా వైసీపీ కార్యకర్త అని.., ఆమె 2012 నుంచి ముషీరాబాద్ నియోజకవర్గంలో వైసీపీ తరపున పనిచేస్తున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాక 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్.., ముషీరాబాద్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇచ్చారని.. ఐతే ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని తేలడంతో చివరి నిమిషంలో నామినేషన్ వేయకుండా ఆగిపోయారని సంచలన ఆరోపణ చేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి భార్య శ్వేతారెడ్డి వైసీపీ తరపున ప్రచారం చేశారన్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు
2014 ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆయన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారని., ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, చంద్రబాబుని ఓడించి, జగన్ ని గెలిపించాలని బహిరంగంగా చెప్పిన చరిత్ర వెంకట్రామిరెడ్డిదని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రావటంతో 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేశారన్నారు. 2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్న తరుణంలో, వారిని రెచ్చగొట్టారని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవిలోకి వచ్చారని., కేవలం 40 ఏళ్ళ వయసులోనే ఆ పదవిలోకి రావడం వెనుక జగన్ ఆశీస్సులు ఉన్నాయని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగల సంఘం నేత వెంకట్రామిరెడ్డిపై నిఘాపెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలు నిమ్మగడ్డ తీరే అనుమానాస్పదంగా ఉందని కాబట్టి ఆయనపైనే నిఘా ఉంచాలని ఉద్యోగ సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నాయి.