• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELUGU DESHAM PARTY HOPE ANNA CANTEEN STRATEGY WILL BRING POWER IN MUNICIPAL ELECTIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP Municipal Elections: అన్నగారు తమ్ముళ్లను గట్టెక్కిస్తారా..? ఆ హామీ ఓట్లు కురిపిస్తుందా..?

AP Municipal Elections: అన్నగారు తమ్ముళ్లను గట్టెక్కిస్తారా..? ఆ హామీ ఓట్లు కురిపిస్తుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో (Andhra Pradesh municipal Elections) తెలుగుదేశం పార్టీ (Telugu Desham party) మళ్లీ అన్నగారినే నమ్ముకుంది. అన్నగారి పేరుతో పట్టిన పథకం ఓట్లు రాలుస్తుందని గట్టిగా నమ్ముతోంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అన్నగారినే నమ్ముకుంది. అన్నగారి పేరుతో పట్టిన పథకం ఓట్లు రాలుస్తుందని గట్టిగా నమ్ముతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ అన్న క్యాంటీన్ల హామీ అక్కరకు వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే అన్న క్యాంటీన్ల అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన టీడీపీ దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అన్నార్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, రూ.5కే పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు టీడీపీ కట్టుబడి ఉందని బుధవారం ఆయన స్పష్టం చేశారు.

    టీడీపీ పరిచయం చేసిన అన్న క్యాంటీన్ లు ఆంధ్ర ప్రజలకు గొప్ప సేవలందించాయని అచ్చెన్నాయుడు వివరించారు. పేద ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జూలై 2019 వరకు దాదాపు 6 లక్షల మంది పేద ప్రజలు మూడు పూటలా అన్న క్యాంటీన్ల ద్వారా ఆత్మగౌరవంతో భోజనం పొందారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి "అన్న క్యాంటీన్" లను మూసివేసి నిరుపేదల నోటికాడ కూడును లాగేసారని అచ్చెన్న విమర్శించారు.

    ఇది చదవండి: ముందు వాటిపై దృష్టి పెట్టండి.. జగన్ కు రఘురామకృష్ణంరాజు సలహా



    టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ 204 "అన్న క్యాంటీన్" లను మూసివేసిన వైకాపా ప్రభుత్వం ఆ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అన్న క్యాంటీన్ లకు కొన్ని మార్పులు చేర్పులు చేసి తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం దానిని ఇంత వరకూ అమలులోకి తీసుకురాలేదని, పైగా వాటిని ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ లుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.అన్న క్యాంటీన్ లు మూత పడడం మూలంగా లాక్ డౌన్ సమయంలో లక్షల మంది నిరుపేదలు ఆకలి బాధలతో అలమటించారన్నారు. అన్న క్యాంటీన్ లు ఉండి ఉంటే వారికి కనీసం ఆహారభద్రత అయినా చేకూరేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తప్పక విజయం సాధిస్తుందని, తమ వాగ్ధానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

    ఇదిలా ఉంటే అధికారంలోకి రాలేమని తెలిసే టీడీపీ ఇలాంటి హామీలిస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు అన్న క్యాంటీన్లలో ఆప్కో షోరూములు ప్రారంభించేందుకు ప్రబుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
    Published by:Purna Chandra
    First published: