ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. వైఎస్ఆర్సీపీని ఓడించి తన ఉనికిని బలంగా చాటుకోవాలని చూస్తోంది. తిరుపతిలో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అందుకు తగ్గట్లే సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో తిరుపతి ఉపఎన్నికల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తిరుపతలో ఆఫీస్ ను ప్రారంభించారు. దీని కేంద్రంగానే ఉపఎన్నికల్లో గెలుపుకు వ్యూహరచన చేయాలని టీడీపీ భావిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాన్ని తెరిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
దళితులు సీఎంను తరిమికొట్టాలి
దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే సీఎం జగన్ కు కనీసం పరామర్శించే తీరిక కూడా లేదా అని అచ్చెన్న ప్రశ్నించారు. కృష్ణాజిల్లాలో ఓ మంత్రి తల్లి చనిపోయినా, కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చనిపోతే హెలికాఫ్టర్ లో వెళ్లిన ముఖ్యమంత్రికి దళిత ఎంపీ చనిపోతే పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులంతా సీఎంను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తిరుపతిలో టీడీపీ ఎలక్షన్ వార్ రూమ్ ను ప్రారంభించిన అచ్చెన్నాయుడు
ఎలక్షన్ వార్ రూమ్
ఇక తిరుపతి టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వార్-రూమ్‌లో రాజకీయ మరియు సామాజిక రంగాల్లో ప్రతి కదలికలను గుర్తించి మరియు ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవటానికి సరైన ప్రణాళికలు రూపొందించే నిపుణులతో కూడిన వాలంటీర్ల బృందం ఉంటుంది. అలాగే పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి వార్-రూమ్‌లో 24/7 హెల్ప్‌లైన్ డెస్క్ మరియు కాల్-సెంటర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రచారం కోసం ప్రత్యేక టీమ్ ను కూడా రంగంలోకి దించుతున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల బాధ్యతలను 39 మంది సీనియర్ నేతలకు అప్పగించింది. వీరి ఆధ్వర్యంలోనే పార్టీ ప్రచారం ముందుకు సాగనుంది.
పీకే ఫార్ములా
అలాగే తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రత్యేక ఎన్నికల వ్యూహంతో బరిలో దిగుతోంది. తిరుపతిలో పార్టీ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అయిన ఫార్ములాను ఇప్పుడు టీడీపీ అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని వ్యక్తినే తమ వ్యూహకర్తగా టీడీపీ నియమించుకుంది. ఐ ప్యాక్ సంస్థలో కీలక పదవిలో పనిచేసిన రాబిన్ శర్మ.., ఇప్పుడు కొత్తగా షో టైమ్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా టీడీపీకి షో టైమ్ కన్సల్టెన్సీనే సేవలందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ట్రైలర్ గా తిరుపతి ఉప ఎన్నికను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే తిరుపతిలో రాబిన్ శర్మ అండ్ టీమ్ తన పనిని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ.., ఎక్కువ ఓట్లు పోలైన మండలాను గుర్తించి ఆయా ప్రాంతాలపై విశ్లేషణ సాగిస్తున్నారు.

చంద్రబాబు - నారా లోకేష్ (ఫైల్)
త్వరలోనే ప్రచారం
ఇక తిరుపతిలో గెలుపు బాధ్యతను చంద్రబాబు.., పలువురు ముఖ్యనేతలకు అప్పగించారు. అచ్చెన్నాయుడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర లాంటి ముఖ్యనేతల నేతృత్వంలో 97 మందితో ప్రత్యేక బృందాన్ని తిరుపతి ఉప ఎన్నిక కోసం రంగంలోకి దించనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఈ కమిటీలోని నేతలంతా నోటిఫికెషన్ వెలువడగానే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. అలాగే బూత్ స్థాయిలో 8వేల మంది కార్యకర్తలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. వీరు చేసే ప్రచార కార్యకలాపాలన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ నుంచి జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది పార్టీ అధిష్టానం. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో లోపాలు, నిత్యావసర ధరలు, మధ్యం మాఫియా, ఇసుక పాలసీ, ఆలయాలపై దాడులు, రోడ్ల సమస్యలు, ఎస్సీలపై దాడులు లాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది.