Telugu Desham Party: ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు క్లాస్.. ఇకనైనా మార్పు వస్తుందా..?

చంద్రబాబునాయుడు (FIle)

తెలుగుదేశం పార్టీలో (Telugu Desham party) అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra babu Naidu) మండిపడ్డారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముఖ్యంగా విజయవాడ టీడీపీలో జరుగుతున్న పరిణామలపై సీరీయస్ అయ్యారు. ఇటీవల ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మల్సీ బుద్ధా వెంకన్న వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంపై చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా అభిప్రాయబేధాలుంటే కూర్చొని మాట్లాడుకోవాలే గానీ.. బహిరంగ విమర్శలు సరికాదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే నేతలు పరస్పరంగా విమర్శించుకోవడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని చంద్రబాబు అన్నారు. పార్టీకి ఇబ్బందులు తీసుకొచ్చే చర్యలను సహించే ప్రసక్తే లేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. అలాగే విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పగించారు.

    విజయవాడ 39వ డివిజన్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 39వ డివిజన్ బరిలో ఉన్న బుద్ధా వెంకన్న వర్గానికి చెందిన గుండారపు పూజిత స్థానంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన హరిబాబును కేశినేని నాని ఎంపిక చేశారు. పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన కేశినేని నానిని పూజిత వర్గం నిలదీసింది. దీంతో నిరసనల మధ్యే ఆయన ప్రచారాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. పైగా కేశినేని నాని ప్రచారానికి స్థానిక నేతలైన బుద్ధా వెంకన్నతో సహా నాగుల్ మీరా, బొండా ఉమా కడా దూరంగా ఉన్నారు. దీంతో బెజవాడ టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

    దీనికి తోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయవాడ లోక్ సభ స్థానం ఎవరిసొత్తూ కాదని.. చివరికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిది కూడా కాదని వ్యాఖ్యానించారు. విజయవాడ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయినా తాను మాత్రం విజయం సాధించానని.. ఈ విషయంలో పైనుంచి కింద స్థాయి వరకు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అభ్యర్థుల విషయంలో బహిరంగంగానే విమర్శించుకోవడంపై అధిష్టానం సీరియస్ అయింది. అందుకే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరితో మాట్లాడారు. విభేదాలు పక్కనబెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.

    ఐతే ఎప్పటి నుంచో కేశినేని నాని-బుద్ధా వెంకన్న మధ్య విభేదాలు నెలకొన్నాయి. గతంలో  ఇద్దరు నేతలు ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. మధ్యలో కొంత తగ్గినా ఎన్నికల సమయంలో బయటపడ్డాయి. చంద్రబాబు తీసుకున్న క్లాస్ తో నేతల్లో మార్పొస్తుందో లేదో చూడాలి.
    Published by:Purna Chandra
    First published: