Chandra Babu Naidu: ఎట్టకేలకు ఫ్లైట్ ఎక్కిన చంద్రబాబు.. 9 గంటల హైడ్రామాకు తెర..

తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు

Andhra Pradesh: చంద్రబాబును (Chandra Babu Naidu) మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్ జెట్ (Spice jet) విమానంలో హైదరాబాద్ (Hyderabad) పంపేందుకు ఏర్పాట్లు చేసినా ఆయన మాత్రం వెనక్కితగ్గలేదు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. తిరుపతి ఎయిర్ పోర్టులో 9గంటల పాటు ఎయిర్ పోర్టులో నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎట్టకేలకు వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:25గంటలకు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైస్ఎఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని.. దీనిపై నిరసన తెలిపేందుకు చిత్తూరుకు బయలుదేరిన ఆయన్ను ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదని.. కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ కారణంగా అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసిన పోలీసులు.. ఎయిర్ పోర్టు బయటకు వెళ్లనీవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వారితో వాగ్వాదానికి దిగారు.

    పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఎంత బ్రతిమాలినా.. చివరకి దండంపెడుతూ వేడుకున్నా వెనక్కి తగ్గలేదు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నేలపైనే బైఠాయించారు. 'సర్ మీరు పెద్దవారు ఇలా నేలపై కూర్చోవద్దంటూ' ఏఎస్పీ స్థాయి అధికారి వేడుకున్నా ఆయన నిరసన కొనసాగించారు. మరోవైపు చంద్రబాబును ఎయిర్ పోర్టులో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ తీవ్రఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబును మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ పంపేందుకు ఏర్పాట్లు చేసినా ఆయన మాత్రం  ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు, అధికారులు చర్చ జరిపారు. దీంతో షెడ్యూల్ ప్రకారం తాను బుక్ చేసుకున్న ఫ్లైట్ కు బయలుదేరేందుకు అంగీకరించారు.

    ఇది చదవండి: అప్పుడు జగన్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ సీన్ రిపీట్..



    చంద్రబాబును ఎయిర్ పోర్టులో నిర్బంధించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. తాము అధికారంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే భద్రత కల్పించిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కేవలం కక్ష సాధింపుకే చంద్రబాబును అడ్డుకున్నారని ఆరోపించారు. రేణిగుంటలో చంద్రబాబును అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు. ప్రతిపక్ష నేత, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రేణిగుంటలో చంద్రబాబు డ్రామా చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖకు వెళ్లిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా అడ్డుకున్నారని వారు ప్రశ్నించారు..

    ఇది చదవండి: ఎస్ఈసీ విషయంలో వైసీపీ స్టాండ్ తీసుకున్న టీడీపీ... అసలేం జరిగిందంటే...


     మొత్తానికి 9 గంటల ఉత్కంఠ పరిస్థితుల  తర్వాత చంద్రబాబు రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Purna Chandra
    First published: