ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడే కొనసాగుతోంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో మూడవ దశ పోలింగ్ కూడా ముగియగా.. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కానీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పరిధిలో పంచాయతీ ఎన్నికలు గానీ, ఇటు మున్సిపల్ ఎన్నికలు గానీ జరగడం లేదు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న కుప్పంలో స్థానిక ఎన్నికలు జరక్కపోవడం చర్చనీయాంశమైంది. కుప్పం ఎన్నికలో సాంకేతికపరమైన చిక్కుల కారణంగానే ఎన్నికలు నిలిచిపోయాయి. కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ గత ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కుప్పం సమీపంలోని ఎనిమిది గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపింది.
ఐతే కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించిన వెంటనే అంటే గత ఏడాది ఫిబ్రవరిలో ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఎనిమిది పంచాయతీలతో పాటు కుప్పంకు ఆ తర్వాత కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి ఏడాది తర్వాత ఎన్నికల వేడి రాజుకున్నప్పటికీ కుప్పం మునిసిపాలిటీ మినహా మిగిలిన చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి.
తాజాగా ఎస్ఈసీ విడుదల చేసిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ లో గత ఏడాది ప్రక్రియనే కొనసాగుతున్నట్లు ప్రకటించడంతో కుప్పంలో ఎన్నికలు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీగా ఉన్న కుపం.. మున్సిపాలిటీగా మారేందుకు ఏడాది గడువున్నా.. వార్డుల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. వార్డుల్లో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉందని.. వచ్చే నెల 20 లోపు ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని కుప్పం మున్సిపల్ అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. కుప్పం నియోజకవర్గమే హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయనకు షాకివ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహరచన చేశారు. ఓ వైపు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో వంద శాతం ఏకగ్రీవాలు కాగా.. మరోవైపు కుప్పంలో 89 గ్రామ పంచాయతీల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. దీనిపై చంద్రబాబుకు, పెద్దిరెడ్డికి మధ్య పెద్ద వివాదమే రేగింది. పెద్దిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ ఏకగ్రీవాలు చేస్తున్నారని.. అలాగే కుప్పంలో అల్లర్లు సృష్టిచేందుకు బయటి వ్యక్తులను రప్పించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖకూడా రాశారు. మరి కుప్పంలో చంద్రబాబు చరిష్మా నిలుస్తుందా.. వైసీపీ అధికారం పనిచేస్తుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.