Telugu Desham Party: బెజవాడ టీడీపీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా...? తెరవెనుక ఏం జరిగింది..?

కేశినేని నాని, బుద్ధా వెంకన్న (ఫైల్)

శ్వేతను (Kesineni Swetha) మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ఇష్టం లేకపోవడం, కేశినేని నాని (Kesineni Swetha) ఇతర నేతలను కలుపుకొని వెళ్లకపోవడమే విభేదాలకు కారణంగా తెలుస్తోంది.

 • Share this:
  విజయవాడ టీడీపీలో నెలకొన్న వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది. శనివారం ఉదయం ఎంపీ కేశినేని శ్రీనివాస్ కు వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సీనియర్ నేత నాగుల్ మీరా తిరుబావుటా ఎగురవేశారు. కేశినేని నాని పార్టీకి ద్రోహం చేస్తున్నారని.. ఒంటెద్దుపోకడలతో  కేడర్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ వివాదం నెలకొనడంతో పార్టీలో కలకలం రేగింది. దీంతో అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరాతో చర్చలు జరిగిన అచ్చెన్న.. విభేదాలు పక్కనబెట్టి ముందుకెళ్లాలని సూచించారు. దీంతో ఉదయం అంతెత్తున లేచిన నేతలంతా ఒక్కసారిగా సైలెంటే అయ్యారు. అబ్బే విభేదాల్లేవ్.. ఏమీ లేవ్..మేమంతా ఒక్కటేనని స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

  ఉదయం బొండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేశినేని శ్రీనివాల్.. తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని.. తనపై నేతలు చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నేను ఎవరికీ ఫిర్యాదు చేయను.. అంతా అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ముగ్గురు అసంతృప్త నేతలు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత.. బొండా ఉమా నివాసానికి వెళ్లి ముగ్గురితో భేటీ అయ్యారు. అధిష్టానం నుంచి ఫోన్ రావడం, అదే సమయంలో శ్వేత ఇంటికెళ్లి మాట్లాడటంతో అంతా సైలెంట్ అయ్యారు.ఈ నిముషం నుంచి లోపాలకు తావులేకండా పనిచేస్తామని అధిష్టానం చెప్పిన దారిలో నడుస్తామని బొండా ఉమా తెలిపారు. అంతేకాదు కేశినేని శ్వేత విజయమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా ప్రకటించారు.

  ఇది చదవండి: బాలయ్య చేతిలో చెంపదెబ్బ తిన్న అభిమాని రియాక్షన్ ఇదే..! ఎమన్నాడో తెలుసా..?  ఇదే వ్యవహారంపై స్పందించిన బుద్ధా వెంకన్న.. పార్టీలో విభేదాల్లేవని.. అభిప్రాయబేధాలు వస్తుంటాయి.. పోతుంటాయని చెప్పారు. శ్వేత అభ్యర్థిత్వాన్ని తాము వ్యతిరేకించలేదని.. చంద్రబాబు టూర్లో అందరూ పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. తాము అసలు పార్టీ లైన్ దాటే మనుషలం కాదని కూడా చెప్పారు. శ్వేత గెలుపుకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. బొండా ఉమాతో భేటీ అనంతరం మాట్లాడిన కేశినేని శ్వేత.. పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. పార్టీలో గ్రూపుతగాదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో బొండా ఉమా... బుద్దా వెంకన్న, నాగుల్ మీరాతో కలిసి పనిచేశానని.. ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తామన్నారు. వైసీపీ అరాచకాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని చెప్పారామె.

  ఇది చదవండి: ఆన్ లైన్లో బుక్ చేసుకున్న ఇసుక ఇంటికి రాలేదా..? అయితే ఇలా చేయండి..


  మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదైలనప్పటి నుంచి రెండు వారాల్లో రెండుసార్లు టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. 39వ డివిజన్ పార్టీ అభ్యర్థి విషయంలో రేగిన చిచ్చు.. ఏకంగా కేశినేని నానిని పార్టీ ద్రోహి అంటూ ముద్రవేసేవరకు వచ్చింది. 39వ డివిజన్ విషయంలో కూడా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ఇష్టం లేకపోవడం, కేశినేని నాని ఇతర నేతలను కలుపుకొని వెళ్లకపోవడమే విభేదాలకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి నేతలంతా సైలెంట్ అయినా.. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మరోసారి కుమ్ములాటలు బయటపడకమానవు అనే కామెంట్స్ బెజవాడలో వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: శని దోష నివారణకు మంత్రి కొడాలి నాని కొత్త ఐడియా...


  Published by:Purna Chandra
  First published: