Andhra Pradesh: ఇవేం బడ్జెట్ సమావేశాలు.. బహిష్కరిస్తున్నామంటూ టీడీపీ ప్రకటన? అసలేం జరిగింది?

తమ్మినేని సీతారాం, చంద్రబాబు నాయుడు

ఏపీలో బడ్జెట్ సమావేశాలు మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఈ నెల 20న ఒక్కరోజు సమావేశం నిర్వహించి.. బడ్జెట్ ను ఆమోదించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందది. ఒక్క రోజు సమావేశం ఏంటి అంటూ టీడీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

  • Share this:
    ఈ గురువారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వానికి కత్తిమీద సామే అని చెప్పాలి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో బడ్జెట్ రూపకల్పన చేస్తోంది. ఇటీవల వరుస ఎన్నికలు.. ఇప్పుడు కరోనా విస్తరణతో సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి.. ఇక తప్పని సరిపరిస్థితుల్లో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం..

    తాజాగా 2.28 లక్షల కోట్ల రూపాయల నుంచి 2.38 లక్షల కోట్ల రూపాయల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయింది ఏపీ ప్రభుత్వం. గ‌తేడాదిసుమారు 1.82 ల‌క్షల కోట్ల వ్య‌యం కాగా.. ఆదాయం కేవ‌లం 77,560 కోట్లు మాత్ర‌మే అంటున్నారు అధికారులు. గతేడాది 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ-వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చంటోంది ఆర్ధిక శాఖ. బడ్జెట్ లోటును ఏ మేరకు చూపాలనే దానిపై అధికారుల తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం… మిగిలిన 9 నెలల కాలానికి ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

    ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం ఎల్లుండి నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యిందని.. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు పెట్టి బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని.. కానీ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలను గతంలో చూశాం.. మరి మార్చిలోనే బడ్జెట్ పెట్టాలి. అప్పుడు టీడీపీ కూడా సమావేశాలు పెట్టమని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. అప్పుడు కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా సమయంలో ఎలా సమావేశాలు నిర్వహిస్తోందని ఆయన ప్రశ్నించారు.

    ఒక్క రోజే అసెంబ్లీని నిర్వహించి తూతూ మంత్రంగా చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా నియంత్రణను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్.. రాష్ట్రంలో వైద్య నిపుణులతో ఒక్కసారి అయినా మీటింగ్ పెట్టారా అని ప్రశ్నించారు. అలాగే వ్యాక్సిన్ పంపిణీలోనూ ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందని విమర్శించారు. మందులు, బెడ్స్, ఆహారం లేక ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో బాధ్యత గల ప్రభుత్వం అంటే కరోనా బాధితులను ఆదుకోవాలి.. కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రాంలో కరోనా సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే.. అసెంబ్లీ జరగకుండా ఒక్కరోజుకే పరిమితం చేయడం ఏం ధర్మమని ప్రశ్నించారు. అందుకే తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు.
    Published by:Nagesh Paina
    First published: