Huzurabad ByElection: హుజూరాబాద్ ఉపఎన్నికలపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల

YS Sharmila: తన తండ్రి వైఎస్ఆర్ తరహాలోనే తాను కూడా చేవేళ్ల నుంచి పాదయాత్రను మొదలుపెడతానని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో తాను ప్రభంజనం సృష్టిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

  • Share this:
    ఇటీవలే కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల.. హుజూరాబాద్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో వచ్చే తొలి ఎన్నికలు ఇవే. ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. మంత్రులంతా మోహరించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాంటి కీలకమైన ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీచేస్తుందా? పోటీ చేస్తే అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతాయి. ఐతే ఈ ప్రశ్నలకు ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చింది వైఎస్ షర్మిల. హుజురాబాద్ ఎన్నికల పగలు, ప్రతీకారాల కోసమే వచ్చాయని.. ఆ ఎన్నికలతో ప్రజలకు ఏమైనా ఉపయోగముందా? అని ప్రశ్నించారు. అలాంటి ఎన్నికల్లో పోటీచేయడం అవసరమా? అంటూ.. తాము పోటీచేయడం లేదని చెప్పకనే చెప్పారు షర్మిల.

    ''పగలు, ప్రతీకారాల కోసమే హుజురాబాద్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఉపఎన్నికలకు అర్దముందా? ప్రజలకు ఏమైనా వస్తుందా? ఉద్యోగాలు వస్తాయా? రైతులకు ఒరుగుతుందా? ఈ ఎన్నికలు అవసరమా? 54 లక్షల మందిని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే పోటీ చేస్తాం. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామనండి. అప్పుడు పోటీచేస్తాం. గెలుస్తాం. అసలు అర్ధమే ఎన్నికలు. కుక్కను నిలబెట్టిన గెలుస్తామన్న వాళ్ల అహం కోసం, పగలు ప్రతికారాల కోసం వచ్చే ఎన్నికల్లో నిలబడాలా? ఇందుకేనా ఎన్నికలు వచ్చేది?'' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


    రాష్ట్రంలో పాదయాత్ర చేసే అంశంపై కూడా వివరణ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ తరహాలోనే తాను కూడా చేవేళ్ల నుంచి పాదయాత్రను మొదలుపెడతానని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో తాను ప్రభంజనం సృష్టిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

    మరోవైపు ఏపీ సీఎం, తన సోదరుడుతో విభేదాల కారణంగానే తెలంగాణలో పార్టీ పెట్టారన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఎవరితోనో విభేదాల వల్ల వైఎస్ఆర్‌టీపీ పుట్టలేదని.. గుండెల్లోంచి పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. ఇక షర్మిల నిరుద్యోగ దీక్షపై కేటీఆర్ సెటైర్లు వేయడంతో... ఆమె తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఇటివల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఆమెను ప్రశ్నించారు. కేటిఆర్ అంటే ఎవరు? సీఎం కేసీఆర్ కొడుకా? అని ఎదురు ప్రశ్నించారు. మహిళలంటే సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటిఆర్‌కు చిన్నచూపని విమర్శించారు. మహిళలంటే ఇంట్లో వంటలు, వ్రతాలు చేసుకోవాలనే ధోరణిలో కేటీఆర్ ఉన్నారని ఎదురు దాడి చేశారు.

    ఏపీ, తెలంగాణ నీటి పంచాయితీపైనా ఆమె మాట్లాడారు. బోర్డు మీటింగ్‌లకు పిలిస్తే వెళ్లనందునే కేంద్రం కలగజేసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు షర్మిల. తెలంగాణ దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని.. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా అడ్డుకోబోమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళ్లైనా కొట్లాడతామని అన్నారు. కేంద్రం గెజిట్‌ను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు వైఎస్ షర్మిల.
    Published by:Shiva Kumar Addula
    First published: