తెలంగాణలోని నిజామాబాద్ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 170 మంది రైతులు ఇక్కడ లోక్ సభ ఎన్నికల బరిలో నిలవడమే ఇందుకు కారణం. పసువు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఆగ్రహంతో ఎన్నికల బరిలోకి దిగిన రైతులు... ఎలాగైనా ఈ ఎన్నికను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎలాగైనా ఈ ఎన్నికను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మరోవైపు అత్యధిక స్థానాలు గెలిస్తే... ఇక్కడి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత రైతులకు హామీ ఇస్తున్నారు.
అయితే తాజాగా ఆర్మూర్లో సభను ఏర్పాటు చేసుకున్న రైతులు... గురువారం జరగబోయే ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల బరిలో దాదాపు 170 మంది రైతులు నిలిచారు. వీరంతా ప్రధాన పార్టీలకు ఓటు వేయొద్దని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో వీరంతా... తమలో ఒకరికి ఓటు వేయడమో లేక ఎవరి కుటుంబాలు వారికి ఓటు వేసేలా చేయడమో చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రైతులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... నిజామాబాద్లో పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్లోకి తీసుకురావడం వెనుక వ్యూహం కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న సెటిలర్లను ఆకర్షించేందుకు మండవను పార్టీలోకి ఆహ్వానించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... నిజామాబాద్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి... రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Farmers Protest, Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019, Trs