news18-telugu
Updated: February 15, 2019, 2:12 PM IST
సండ్ర వెంకటవీరయ్య(File)
టీటీడీ పాలకమండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నియామకం రద్దయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితుడైన సండ్ర వెంకటవీరయ్య... నిబంధనల ప్రకారం నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే నెల రోజులు దాటినా... ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య... అధికార టీఆర్ఎస్లోకి వెళతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై సండ్ర వెంకటవీరయ్య స్పందించకపోయినా... ఆయన అనుచరుల మాత్రం సండ్ర టీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు. అయితే త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న తరుణంలో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ సభ్యత్వం రద్దు కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఆయన టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేసిందనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరితే... ఆయనకు మంత్రి పదవి కాకపోయినా కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి సండ్ర వెంకటవీరయ్య టీటీడీ పాలకమండలి సభ్యత్వం రద్దుకు అసలు కారణం ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
First published:
February 15, 2019, 2:12 PM IST