Home /News /politics /

TELANGANA TDP AND YSRCP DISAPPEARED FROM KHAMMAM FIGHT BETWEEN TRS AND CONGRESS AK

ఖమ్మంలో విచిత్ర పరిస్థితి... ఐదేళ్లలో కనుమరుగైన రెండు పార్టీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐదేళ్ల క్రితం ఖమ్మం ఎంపీ సీటు కోసం హోరాహోరీగా తలపడ్డ టీడీపీ, వైసీపీలు... ఇప్పుడు ఖమ్మంతో పాటు తెలంగాణలో మొత్తానికి మొత్తంగా కనుమరుగయ్యాయి.

    రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఖమ్మం రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే... ఈ విషయం నిజమే అని మరోసారి అర్థమవుతోంది. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ ‌సభ స్థానం కోసం టీడీపీ, వైసీపీ పోటీపడ్డాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పరస్పరం పోటీపడ్డ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు... ఖమ్మంలో మాత్రం పోటీలో లేకుండాపోయాయి. ఖమ్మంలో బలంగా ఉండే టీడీపీ... అనూహ్యంగా బలం పుంజుకున్న వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీడీపీ తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై వైసీపీ తరపున బరిలోకి దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించి... తెలంగాణలో వైసీపీకి బలం ఉందని నిరూపించారు.

    ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌లోకి ఖమ్మంలోని కీలక నేతలు వలసొచ్చారు. టీడీపీ దాదాపుగా ఖాళీ అయ్యింది. వైసీపీ కూడా టీఆర్ఎస్‌లో విలీనం అయిపోయింది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీడీపీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. దీంతో ఈ ఎన్నికల నాటికి ఖమ్మంలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నామా నాగేశ్వరరావు మరోసారి ఎంపీగా పోటీ చేస్తుంటే... గతంలో ఖమ్మం ఎంపీగా వ్యవహరించిన రేణుకా చౌదరి మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారు.

    అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా... గత ఎన్నికల్లో పోటీపడ్డ టీడీపీ, వైసీపీలు ఈ సారి పోటీలో లేకుండా పోవడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తెలంగాణలో ఉనికి లేని పార్టీలు కావడం వల్లే... ఈ రెండు పార్టీలు ఇక్కడ కనుమరుగయ్యాయనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని కాపాడుకోవాలని ఈ రెండు పార్టీల అధినేతలు ప్రయత్నించి ఉంటే... ఇప్పటికీ టీడీపీ, వైసీపీ ఖమ్మంలో ఎంతో కొంత బలంగా ఉండేవనే వాదన కూడా ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డ టీడీపీ, వైసీపీలు... ఈ ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Khammam, Khammam S29p17, Lok Sabha Election 2019, Tdp, Telangana Lok Sabha Elections 2019, Trs, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు