కంటతడి పెట్టిస్తున్న ఆర్టీసీ కండక్టర్ రాజీనామా లేఖ... కేసీఆర్‌ సార్ అంటూ...

‘మీరు ఉద్యోగంలో నుంచి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. దానికి కారణం లేకపోలేదు సార్.’ అంటూ ఆర్టీసీ కండక్టర్ సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు.

news18-telugu
Updated: November 27, 2019, 5:23 PM IST
కంటతడి పెట్టిస్తున్న ఆర్టీసీ కండక్టర్ రాజీనామా లేఖ... కేసీఆర్‌ సార్ అంటూ...
ఆర్టీసీ, సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆర్టీసీ ఉద్యోగి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యాపేట డిపోకు చెందిన ఉద్యోగి... అర్వపల్లి మండలం సూర్యానాయక్ తండాకు చెందిన లూనావత్ కృష్ణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ..

గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి....
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా. ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టానురా నాయనా? అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నా.

మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుంచి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. దానికి కారణం లేకపోలేదు సార్. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సార్ ఉన్నారు. ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న. కానీ సార్ మా 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడు అనిపించింది.. సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీ లాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఉహించలేదు సార్. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యం అయింది సార్. నా చెల్లెళ్లు ఏడుస్తుంటే, రోజూ నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్నా సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్. నా RTCఅక్క చెల్లెళ్ల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సార్.

నేను సూర్యాపేట డిపో లో RTC కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నా. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి, ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మభిమనాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. నా పేరు ఎల్.కృష్ణ. నా స్టాఫ్ నెంబర్ 176822. సూర్యాపేట డిపో సార్. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుంచి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి.

అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సార్ ఆర్టీసీ వాళ్ళు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఉహించి ఉండరు సార్. పాపం ఆర్టీసీ వాళ్ళు సార్ వాళ్లకు వచ్చే రూ.15,000 జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు సార్. మీరు వాళ్లకు ఏమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీమీద గౌరవంతో ప్రాణాలు ఇచ్చేవారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులు సార్ కనీసం వాళ్ళను అయిన సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్ళకి వృద్దాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్ములను నమ్మి మీకు మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. వాళ్ళు బాధపడుతుంటే సమాజంలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సార్. ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది? ఈ లాఠీ దెబ్బలు ఏంది? నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారు? అని ఇంకా ఎంత మందిని ఆత్మహత్యలు చేస్కునేట్టు చేస్తారు?. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజం లోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు.ఇట్లు
ఎల్. కృష్ణ,
స్టాఫ్ నెంబర్ 176822
RTC కండక్టర్, సూర్యాపేట డిపో
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading