news18-telugu
Updated: November 10, 2019, 1:41 PM IST
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
ఆదివారం రాజకీయ పార్టీలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. సోమవారం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.అలాగే 13,14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఛలో ట్యాంక్‌బండ్ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ దమనకాండను మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.అవసరమైతే జేఏసీ నేతలతో ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. అలాగే ఈ నెల 18న సడక్ బంద్ చేపట్టాలని నిర్ణయించారు.
కాగా, శాంతియుతంగా నిరసనకు బయలుదేరిన కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారని సమావేశంలో అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఛలో ట్యాంక్‌బండ్ సందర్భంగా మావోయిస్టులు కూడా అందులో భాగమయ్యారని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కార్మికులు,రాజకీయ పార్టీల కార్యకర్తలే నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించడం వల్లే చాలామంది గాయాలపాలయ్యారని ఆరోపించారు. ఏదేమైనా ప్రభుత్వంపై చేస్తున్న ఈ పోరాటం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సమావేశంలో నిర్ణయించారు.
మొత్తం మీద ఛలో ట్యాంక్‌బండ్ విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తామేంటో నిరూపించామని ఆర్టీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఇలాగే ఒత్తిడి పెంచగలిగితే సీఎం దిగిరావడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదివారం మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం హైకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై ఆయన చర్చించనున్నట్టు తెలుస్తోంది.కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను కోర్టుకు సమర్పించాలని కోరడంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రూట్ పర్మిట్లను సమర్థించుకునేలా ప్రభుత్వం తరుపున గట్టిగా వాదించాలని కేసీఆర్ సూచించినున్నట్టు సమాచారం.
Published by:
Srinivas Mittapalli
First published:
November 10, 2019, 1:37 PM IST