HOME »NEWS »POLITICS »telangana results putting pressure on andhra bjp leaders prn

BJP Target: ఒత్తిడిలో ఆంధ్రా బీజేపీ నేతలు.., తెలంగాణ ఫలితాలే కారణమా..?

BJP Target: ఒత్తిడిలో ఆంధ్రా బీజేపీ నేతలు.., తెలంగాణ ఫలితాలే కారణమా..?
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తిరుపతిలో ఎలాగైనా గెలవాల్సిందేనని అధిష్టానం వారిపై ఒత్తిడి పెంచుతోంది.

 • Share this:
  రాజకీయాల్లో లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలెప్పుడు దీర్ఘకాలికంగా ఉండాయి. నేతలు, పార్టీ కేడర్ బలంగా ఉండి.. ఉత్సాహంగా అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు. ఇక పాలిటిక్స్ లో ఏదీ తక్కువ కాలంలో సాధ్యం కాదు. అలా చేయాలంటే అద్భుతాలు జరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు ఇలాంటి లక్ష్యమే ముందుంది. తెలంగాణలో సాధించిన ఫలితాల జోరు ఏపీలోనూ రిపీట్ కావాలని అధిష్టానం టార్గెట్ సెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదీగాక ఏపీలో మెరుగైన ఫలితాలు తీసుకురాకుంటే వెనుకబడిపోతామన్న ఒత్తిడి కూడా రాష్ట్ర బీజేపీ నేతలపై ఉంది. రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని మ్యాజిక్ చేయగలమా., దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు మనచావుకొచ్చాయని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.

  దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలు ఇచ్చిన జోష్ తో బీజేపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. దక్షిణాదిలో పాగా వేసేందుకు ఈ ఫలితాలు మంచి ఎనర్జీని ఇస్తాయని భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ కేడర్ బలంగా పనిచేయడంతో ఇప్పుడక్కడ బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇక ఏపీలో కూడా అదే మార్క్ వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని ఏపీ నేతలు భావిస్తున్నారు. ఐతే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు., ఏపీలో వేరు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటింది. దీంతో అక్కడ ప్రజలు టీఆర్ఎస్ పాలనపై ఎక్కడో ఓచోట అసంతృప్తి మొదలై బీజేపీకి ఎడ్జ్ ఇచ్చారు.


  కానీ ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. పైగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ అమలవుతున్నాయి. బీజేపీతో పోలిస్తే వైసీపీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బలమైన నేతలు, కేడర్ ఆపార్టీకి ఉంది. అలాంటి వైసీపీని.. అందునా తిరుపతిలో ఢీ కొట్టి గెలవడమంటే మామూలు విషయం కాదు. పైగా 2019లో తిరుపతిలో బీజేపీకి 20వేల ఓట్లు కూడా రాలేదు. దివంగత వైసీపీ ఎంపీ బల్లి దుర్గప్రసాద్ కు ఏకంగా 7లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. మెజారిటీ కూడా 2లక్షలకు పైగా వచ్చింది. ఇక్కడి ఎన్నికల్లో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చినా చాలని బీజేపీ నేతలు భావిస్తుంటే.. అధిష్టానం మాత్రం గెలవాల్సిందేనని పట్టుబడుతుండటంపై ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  రాష్ట్రంలో బీజేపీ యాక్టివ్ గా బలంగా ఉందని నిరూపించుకునేందుకు బీజేపీ నేతలు బాగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇటీవల రోడ్లు బాగోలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పార్టీ మిషన్ ను తిరుపతి నుంచే మొదలుపెట్టేందుకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించారు. ఈ సమావేశంలో రివర్స్ టెండరింగ్, రోడ్లు, రైతుల సమస్యలతో పాటు వ్యవసాయ చట్టాలపై వైసీపీ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో కేంద్రానికి సలాం కొడుతూనే ఇక్కడ విమర్శలు, ధర్నాలు చేస్తూ నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. మరి బీజేపీ తిరుపతిలో తన టార్గెట్ ను రీచ్ అవుతుందా..? కమలనాథులను వెంకన్న కరుణిస్తాడా..? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published:December 12, 2020, 16:05 IST