ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు ఎన్నికల సంఘంతో నువ్వా నేనా అన్నట్లుగా తలపడిన జగన్ సర్కార్..ఇప్పుడు చేసేదేం లేక ఎన్నికల నిర్వహణకు సిద్ధమయింది. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కొత్త రాగం ఎత్తుకుంది. ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని.. పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది. అలాంటి గ్రామాలకు భారీగా ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రచారం చేస్తోంది. దానికి సంబంధించి ఇవాళ అన్ని పేపర్లలో ప్రకటన కూడా వచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందా అంటూ సమాచార, పౌర సంబంధాల శాఖ యాడ్ ఇచ్చింది. ఈ యాడ్ విషయంలో తప్పులో కాలేసింది జగన్ సర్కార్.
పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం గురించి ఇచ్చిన ప్రకటనలో తెలంగాణకు చెందిన ఓ గ్రామ పంచాయతీ భవనం ఫొటో వేశారు. అందులో తెలంగాణ ప్రభుత్వం లోగో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌పై విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో ఒక్క గ్రామ పంచాయతీ ఫొటో కూడా మీకు దొరకలేదా..? అని ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ఫొటోను వేస్తారా? అని ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు.
పంచాయతీలో ఏకగ్రీవాలు చేస్తే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షల ప్రోత్సాహకం అందిస్తారు. 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు నిధులు లభిస్తాయి. 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది.
ఏపీలో మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికలకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:January 27, 2021, 10:33 IST