Revanth Reddy: ఇదేం పద్ధతి.. రేవంత్ రెడ్డికి సీనియర్ నేత షాక్.. కీలక నేత ముందే అసంతృప్తి..

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: రేవంత్ రెడ్డి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

  • Share this:
    రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేతల జాబితాలో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరహాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో ఎప్పుడూ బయటపడలేదు. దీంతో అసలు రేవంత్ రెడ్డి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉందో ఎవరికీ అంతుచిక్కలేదు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ముందే. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత మొదటిసారి గాంధీ భవన్‌కు వచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... మాణిక్కం ఠాగూర్ ముందే రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని పార్టీలాగా నడిపించాలని ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. ఒక్కరి మైలేజ్ కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో కొత్త కార్యవర్గం విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. పరోక్షంగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఉద్దేశించే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ మాటలను విన్న మాణిక్యం ఠాగూర్.. ఇక నుంచి అలా కాకుండా చూస్తానని ఆయనకు తెలిపారు. పార్టీ లైన్ లోనే నాయకులు పనిచేయాలని రేవంత్‌కు దిశానిర్దేశం చేశారు. సమిష్టిగా పనిచేయాలని, సీనియర్ల అనుభవాలను కూడా పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలని సూచించారు.

    రేవంత్ రెడ్డి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల కొందరు నేతలపై టీపీసీసీ బహిష్కరణ వేటు వేసింది. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కావాల్సిన వారని తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకోకుండా ఉత్తమ్ కుమార్ వర్గం తీవ్రంగా ప్రయత్నించిందని.. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ దూకుడుగా వ్యవహరించి వారిపై వేటు వేసిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇది కూడా ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.

    Huzurabad: సెప్టెంబర్‌లో ‘హుజూరాబాద్’ నగారా ?.. ఆంధ్రప్రదేశ్ సీటుతో లింకు..!

    మరోవైపు పలు సభలు, సమావేశాల విషయంలో పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని.. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారని.. ఇదే విషయాన్ని ఆయన మాణిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై ఆయన సమక్షంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: