Home /News /politics /

TELANGANA NEWS LEADERS RELATED WITH HUZURABAD BY POLLS GETTING POSTS TWO EX MINISTERS IN QUEUE AK

Huzurabad: హుజూరాబాద్‌ ఎఫెక్ట్.. నేతలకు వరుస పదవులు.. క్యూలో ఇద్దరు మాజీమంత్రులు ?

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana: హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగడానికి ముందు ఇంకెంతమంది నేతలకు పదవులు వస్తాయా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

    తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే ఎక్కువగా తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రభావితం చేసే విధంగానే ఉంటున్నాయని వేరే చెప్పనవసరం లేదు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం అమలు కోసం పైలెట్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంతో పాటు ఇక్కడి నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం కూడా ఇందులో భాగమే అనే చర్చ సాగుతోంది. హుజూరాబాద్‌కు చెందిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన చేరిన కొద్దిరోజులకే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, వకుళాభరణం కృష్ణమోహన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హుజూరాబాద్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న మరికొందరు నేతలకు కూడా పదవులు వస్తాయేమో అనే చర్చ మొదలైంది.

    హుజూరాబాద్‌కు చెందిన మాజీమంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లోచేరారు. ఆయన సేవలను టీఆర్ఎస్ ఏ విధంగా వాడుకుంటుంది ? ఆయనకు ఏ రకమైన పదవి ఇస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు కొద్ది వారాల క్రితం టీడీపీలో చేరిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు కూడా హుజూరాబాద్ కోటాలోనే పదవి వస్తుందనే చర్చ సాగుతోంది. నిజానికి ఎల్. రమణకు హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందనే వార్తలు వచ్చాయి. బీసీ నాయకుడైన రమణను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ యోచించినట్టు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. దీనికి తోడు ఎల్. రమణతో పోలిస్తే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్పీ పదవి ఆఫర్ చేసింది టీఆర్ఎస్. దీంతో ఎల్.రమణకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రమణను మండలికి పంపిస్తారని ఊహాగానాలు వచ్చాయి.

    మరో మాజీమంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో వీరిలో ఎవరికి ఏ రకమైన పదవి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. వీరికి పదవులు దక్కితే.. అవి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోటాలోనే అని భావించాల్సి ఉంటుందని తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగడానికి ముందు ఇంకెంతమంది నేతలకు పదవులు వస్తాయా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Huzurabad By-election 2021, Telangana, Trs

    తదుపరి వార్తలు