Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? సీనియర్ నేతలు అడ్డుపడుతున్నారా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: ఏం చేసినా.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసే విధంగా చేపట్టే రేవంత్ రెడ్డి.. మెదక్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభను గజ్వేల్‌లో ఏర్పాటు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరినట్టుగా ఉంటుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

 • Share this:
  తెలంగాణవ్యాప్తంగా దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించాలని ప్లాన్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో సభలు ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది. అయితే మూడో సభ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహిస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ సభను సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావించారని వార్తలు వచ్చాయి. దీనిపై పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోకముందే గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ అని ప్రచారం జరగడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయడానికి బదులుగా మెదక్‌లో సభ ఏర్పాటు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజర్సింహ సూచించారని టాక్. గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేసే విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అంత సుముఖంగా లేరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  మరోవైపు ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం వేరే విధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏం చేసినా.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసే విధంగా చేపట్టే రేవంత్ రెడ్డి.. మెదక్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభను గజ్వేల్‌లో ఏర్పాటు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరినట్టుగా ఉంటుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోకుండా గజ్వేల్ సభ విషయంలో ఏర్పాట్లు ఎలా చేస్తారని ఓ వర్గం వాదిస్తున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి నిర్ణయాలు పార్టీలో చర్చించుకోకుండా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే వాదన కూడా ఉంది. ఇంద్రవెల్లి సభలో ఇబ్రహీంపట్నంలో దళిత, దండోరా సభను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

  అయితే అక్కడి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఈ సభకు రాలేనని.. తేదీ మార్చాలని అన్నారు. దీంతో సభను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి నుంచి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలకు మార్చారు. అయితే మరోసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడమే మంచిదని కొందరు నేతలు సూచిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత దండోరా సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. అనుకున్నది చేస్తారేమో చూడాలి.
  Published by:Kishore Akkaladevi
  First published: