K Chandrashekar: హరీశ్ రావు తరహాలోనే సీఎం కేసీఆర్ కూడా ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తారేమో అని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గురించి ప్రస్తావించలేదు.
హుజూరాబాద్‌లో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ దిశగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. సీఎం కేసీఆర్ సైతం ఈటలను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈటల రాజేందర్ గురించి ప్రత్యక్షంగానే, పరోక్షంగానే స్పందిస్తారని పలువురు భావించారు. విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన విధంగానే.. ఈటల రాజేందర్‌కు కూడా పరోక్షంగా కౌంటర్ ఇస్తారని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అసలు హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక లేదన్నట్టు.. ఈటల రాజేందర్ తమ ప్రత్యర్థి కాదన్నట్టుగా వ్యవహరించారు. ఇది కూడా ఆయన వ్యూహంలో భాగమే అని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. నిజానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించిన వెంటనే హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఈటల రాజేందర్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్లపాటు సన్నిహితుడిగా ఉన్న రాజేందర్‌పై చిరకాల ప్రత్యర్థి తరహాలోనే ధ్వజమెత్తారు. ఇప్పటికీ ఆయనపై ఏదో రకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
అయితే హరీశ్ రావు తరహాలోనే సీఎం కేసీఆర్ కూడా ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తారేమో అని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గురించి ప్రస్తావించలేదు. ఈ రకంగా హుజూరాబాద్‌లో తాను ఈటల రాజేందర్ గురించి మాట్లాడబోనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో విజయవంతంగా అమలు చేయడమే తన ముందున్న లక్ష్యమని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఈ రకంగా ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కొత్త ఎజెండాను సెట్ చేశారు. దీంతో ఆయనకు ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్‌ను విమర్శించే అవకాశం పెద్దగా ఉండబోదని అన్నారు. మరోవైపు బాహాటంగా ఈటల రాజేందర్‌పై విమర్శలు చేయని సీఎం కేసీఆర్.. ఆయనపై పార్టీ నేతలు చేసే రాజకీయ దాడి విషయంలో మాత్రం కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ తాను ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తే.. అటు వైపు నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుందని సీఎం కేసీఆర్‌కు తెలియనిదికాదు. అప్పుడు చర్చంతా దానిపైనే జరుగుతుందని.. ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంపై చర్చ పక్కదారి పడుతుందని సీఎం కేసీఆర్ భావించి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా.. కేసీఆర్ ఇక్కడకు ఎప్పుడు వచ్చినా.. ఆయన మాత్రం ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకురాననే విషయం నిన్నటి సభతో తేలిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్’లో ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించే అవసరం లేకుండా సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో కొత్త ఆలోచన చేశారని అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.