ప్రజాకూటమితో ఉద్యమగళాలు, టీఆర్ఎస్‌ ఓట్లు గల్లంతేనా?

కోదండరాం, గద్దర్, మంద కృష్ణమాదిక, ఆర్ కృష్ణయ్య... ఒకప్పుడు తెలంగాణ ఆవిర్భావం కోసం అహరహం కృషి చేసిన ఈ ఉద్యమ నేతలంతా, ఇప్పుడు ప్రజా కూటమితో జట్టుకట్టి ముందుకు సాగుతున్నారు. ప్రజా సంఘాల నేతలంతా మేడ్చల్ సభలో ఒకే దండుగా కనిపించి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇది ప్రజాకూటమికి అదనపు బలంగా మారడమే కాదు, టీఆర్ఎస్‌ ఓటు బ్యాంకుకు గండి కొట్టనట్లు కూడా అవుతుందనే అంచనాలున్నాయి.

news18-telugu
Updated: November 28, 2018, 10:47 PM IST
ప్రజాకూటమితో ఉద్యమగళాలు, టీఆర్ఎస్‌ ఓట్లు గల్లంతేనా?
ప్రొఫెసర్ కోదండరాం (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వెంట నడిచిన ప్రజా సంఘాల నేతలు ఈ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. టీ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం, ఈమధ్య తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి ప్రజా కూటమిలో భాగమయ్యారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో కోదండరాంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్‌, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వేదికను పంచుకున్నారు. కృష్ణయ్య కాంగ్రెస్‌ మిర్యాలగూడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సభలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నేతలు ఎల్‌.రమణ, కోదండరాం, చాడా వెంకట్‌రెడ్డితోపాటు ఆర్‌.కృష్ణయ్య కూడా ప్రసంగించారు. సభకు ఆహ్వానించిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో సోనియా, రాహుల్‌తో ప్రత్యేకంగా సమావేశమై కాసేపు చర్చించారు.

ఆర్.కృష్ణయ్య( Image: Facebook)
ఆర్.కృష్ణయ్య( Image: Facebook)


కేసీఆర్‌కి ఎందుకు దూరమయ్యారు?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు ఏడాది పాటూ ఉద్యమ నేతలంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాతే పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. తన సొంత నిర్ణయాలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తుండటంతో, తమకు సరైన గుర్తింపు దక్కట్లేదని కోదండరాంతోపాటూ ఉద్యమ నేతలంతా భావించారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఇది సరికాదు అంటూ తమ అభిప్రాయాన్ని వివిధ సందర్భాల్లో వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచీ రెస్పాన్స్ రాకపోయేసరికి, ఉద్యమ నేతలంతా కేసీఆర్‌కి దూరమయ్యారు. కుటుంబ పాలన అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. రాన్రానూ పరిస్థితి జఠిలంగా మారింది. అదే సమయంలో అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడంతో ఉద్యమ నేతల చూపు ప్రజా కూటమిపై పడింది. కాంగ్రెస్ నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మాటలు కలిశాయి. తమ గళాలు వినిపించేందుకు ప్రజా కూటమి రూపంలో భారీ వేదిక దొరికిందని ఉద్యమకారులు భావించారు. ఫలితమే మేడ్చల్ సభలో జరిగిన పరిణామాలు.

టీఆర్ఎస్ సభకు వస్తున్న కార్యకర్తలు (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ సభకు వస్తున్న కార్యకర్తలు (ఫైల్ ఫొటో)


టీఆర్ఎస్ ఓట్లకు గండి పడినట్లేనా?తెలంగాణలో 55 శాతం బీసీలున్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు దాదాపు 30 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాల వెంట నడిచినవాళ్లే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్లంతా పూర్తి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ప్రజా సంఘాలు, ప్రజా కూటమివైపు మొగ్గు చూపుతుండటంతో ఈ వర్గాల ప్రజలు ఎటువైపు మళ్లుతారన్నది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ చెబుతున్నట్లు టీఆర్ఎస్ 100 కంటే ఎక్కువ సీట్లు సాధించాలంటే, అన్ని వర్గాల ఓట్లూ పార్టీకి తప్పనిసరి. కానీ పరిస్థితులు టీఆర్ఎస్ ఓట్లకు ప్రజా సంఘాలు గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల్లో చాలా మంది ఇటు ప్రజా కూటమి, అటు టీఆర్ఎస్ ప్రకటించే మేనిఫెస్టోలను బేరీజు వేస్తున్నారు. ఎవరు మెరుగైన మేనిఫెస్టో ఇస్తే, వాళ్లవైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
First published: November 24, 2018, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading