Home /News /politics /

TELANGANA MLC ELECTIONS 2021 RESULTS FIRST PRIORITY VOTE COUNTING COMPLETED IN HYDERABAD SEGMENT SK

Telangana: హైదరాబాద్ సెగ్మెంట్‌లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. ఎవరు విజేత?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana graduate MLC elections 2021 results: హైదరాబాద్ సెగ్మెంట్‌లో మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రామచంద్రరావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై రెండు రోజులు గడిచాయి. కానీ విజేతలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్‌తో పాటు నల్గొండ వరంగ్ ఖమ్మం స్థానంలోనూ.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం లేదు. ఎవరికీ 50 శాతంపైగా ఓట్లు రాలేదు. నల్గొండ పరిధిలో ఇప్పటికే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్ పరిధిలోనూ కాసేపటి క్రితమే ప్రారంభమయింది. హైదరాబాద్ సెగ్మెంట్‌లో మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రామచంద్రరావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    మొత్తం ఏడు రౌండ్లలోని మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 1,04,668 పోలయ్యాయి. ఇండిపెండంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 5,973 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లలో మొత్తం 21,309 చెల్లని ఓట్లను గుర్తించారు. అభ్యర్థి విజయానికి ఇంకా 1,79,175 ఓట్లు కావాల్సి ఉంది. రెండో ప్రాధాన్యతా ఓట్లతోనూ క్లారిటీ వచ్చే అవకాశం లేదని.. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    నల్గొండ పరిధిలో ఏడు రౌండ్లు పూర్తయ్యాక... టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636 ఓట్లు చెల్లకపోవడంతో.. 3,66,333 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 70,072, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం పైగా ఓట్లు రాకపోవడంతో రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి.

    కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ పట్టభద్రుల నియోజవర్గంలో 93 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Telangana, Telangana mlc election, Telangana Politics, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు