YS Sharmila: వైఎస్ షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

షర్మిల

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు.

  • Share this:
    తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట షర్మిల వస్తారని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని.. అప్పుడు తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. ‘ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోంది. తర్వాత మెల్లగా జగన్ వస్తారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు. కేసీఆరే మన రక్షకుడు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవు.’ అని గంగుల కమలాకర్ అన్నారు.

    తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల ఇటీవల అన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. వైఎస్ షర్మిల ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నారనే దానిపై రెండు తేదీలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.  మే 14 లేదా జులై 8న కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని జోరుగా చర్చ జరుగుతోంది. జూలై 8న వైఎస్ రాజశేఖర్‍రెడ్డి జయంతి. అందుకే జూలై 8న పార్టీని ప్రకటించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఐతే అందుకు ఇంకా 5 నెలలు ఉన్నందున ఆలస్యమవుతుందని కొందరు నేతలు ఆమెకు సూచించారట. మే 14 అయితే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. మే 14నే సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు పార్టీని ప్రకటిస్తే.. వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చని నేతలు షర్మిలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి మే 14, జులై 8 తేదీలను షర్మిల పరిశీలిస్తున్నారు.

    వైఎస్ షర్మిల ఆంధ్రకు చెందిన వ్యక్తిగా నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనేదానిపై ఆమె ముందస్తుగానే ప్రణాళిక రచించినట్టు తెలిసింది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెడితే.. అసలు ఆమెకు తెలంగాణలో ఏం సంబంధం అని ప్రశ్నించే వారి సంఖ్య ఎక్కువగా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఇందుకు సమాధానం షర్మిల దగ్గర సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను తెలంగాణ కోడలినని షర్మిల ప్రచారం చేసుకునే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆయన పెరిగింది హైదరాబాద్‌లోనే. ఈ లెక్కన తాను తెలంగాణ కోడలినని షర్మిల చెప్పనున్నారని.. ఆ రకంగా తనకు ఇక్కడ రాజకీయాలు చేసే అర్హత ఉందని ఆమె ప్రచారం చేసుకోనున్నారని తెలుస్తోంది. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం అనే ప్రశ్నకు ఆమె చెప్పబోయే సమాధానం ఇదేనని.. తనకు ఏపీతో పాటు తెలంగాణ కూడా సమానమే అని చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: