చేరికలతో దుమ్ము లేపుతున్న తెలంగాణ బీజేపీ.. ఏకంగా కీలక మంత్రి తమ్ముడికే గాలం.. త్వరలోనే పార్టీలోకి..

ఎర్రబెల్లి ప్రదీప్ రావు(Photo:Facebook)

Telangana BJP: దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీద ఉన్న బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. తాజాగా కీలక మంత్రి తమ్ముడు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 • Share this:
  దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో జోష్ మీద ఉన్న బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. వరుస చేరికలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కు ఒకప్పటి అత్యంత సన్నిహితుడు, వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ సైతం బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, టీఆర్ఎస్ నేత ప్రదీప్ రావు బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో ప్రజా రాజ్యం పార్టీ తరఫున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. అయితే ప్రస్తుతం ఆయనకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పొసగడం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

  ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రదీప్ రావును బీజేపీ నేతలు కలిసి పార్టీలో చేరికలపై మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.  అయితే టికెట్ విషయంలో సానుకులంగా స్పందించినా.. స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదని తెలుస్తోంది. ఒక వేళ అన్ని అనుకూలంగా జరిగి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకుంటే.. అది ఎర్రబెల్లి దయాకర్ రావుకు పార్టీలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. తమ్ముడినే పార్టీ మారకుండా కాపాడుకోలేక పోయాడని మంత్రిపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

  ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి డీకే అరుణ.. మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్‌ను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఇందుకోసం స్వయంగా చంద్రశేఖర్ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు డీకే అరుణ. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా వ్యవహరించిన చంద్రశేఖర్.. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. డీకే అరుణ రాయబారంతో కాషాయదళంలో చేరడానికి చంద్రశేఖర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్న చంద్రశేఖర్.. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన వికారాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

  మొత్తానికి తెలంగాణలో బలమైన నేతలను ఆకర్షిస్తున్న బీజేపీ.. నియోజకవర్గాలవారీగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది. మొదటగా తెలంగాణలో బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలను తమ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పటికే పలువురు నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా వ్యవహరించి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుల జాబితాను సిద్ధం చేసుకున్న బీజేపీ నాయకత్వం.. వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోందని తెలుస్తోంది.
  Published by:Nikhil Kumar S
  First published: