హోమ్ /వార్తలు /National రాజకీయం /

Telangana: టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? సాగర్ బరిలో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు

Telangana: టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? సాగర్ బరిలో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని..కానీ ఇప్పటి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుమారెడ్డి వాపోయారు.

గత పార్లమెంట్ ఎన్నికలు గుర్తున్నాయి కదా. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో వందలాది మంది పసుపు రైతులు నామినేషన్ వేశారు. పసుపు బోర్డు తేవడంలో ఎంపీ కవిత విఫలమయ్యారని.. అందుకే తాము నామినేషన్ వేసినట్లు చెప్పారు. రైతుల ఆందోళనలతో ఆ ఎన్నికల్లో కవిత ఓడిపోయారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సాగర్ ఉపఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అమవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకే సాగర్‌లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది.

''తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1,385 అమరవీరుల కుటుంబాలను గుర్తించింది. కానీ ఇందులో 500 కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. మా కష్టాలను ప్రపంచానికి చెప్పేందుకు సాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 400 మంది అమర వీరుల కుటుంబ సభ్యులం నామినేషన్ వేయబోతున్నాం.'' అని తెలంగాణ అమరవీరుల ఫోరం అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు.

400 కంటే ఎక్కువ నామినేషన్లే వేద్దామని భావించామని... కానీ ఆర్థిక ఇబ్బందులు కారణంగా 400 మంది మాత్రమే నామినేషన్ వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని..కానీ ఇప్పటి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుమారెడ్డి వాపోయారు. ఈ పోరాటంలో తాము వైఎస్ షర్మిల మద్దతు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిలను కలిసి తమ కష్టాలను చెప్పుకుంటామని వెల్లడించారు. అమరవీరుల పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన దళిత్ యాక్షన్ కమిటీ మద్దతు తెలుపుతోందని రఘుమారెడ్డి చెప్పారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలయింది. బుధవారం నాటికి 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థి వేటలో ఉన్నాయి. మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఐతే మార్చి 27, 28, 29 తేదీలను ఈసీ సెలవుగా ప్రకటించడంతో.. మార్చి 25, మార్చి 30న మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. ఏప్రిల్ 3 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటే నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

First published:

Tags: Nagarjuna sagar, Nagarjuna Sagar By-election, Telangana

ఉత్తమ కథలు