Home /News /politics /

TELANGANA LOK SABHA ELECTIONS PEDDAPALLI LOK SABHA CONSTITUENCY PROFILE BA

Your Parliament : పెద్దపల్లిలో ఎప్పుడూ నాన్ లోకల్ నేతకే పట్టం.. ఈసారీ అంతే

పెద్దపల్లి బోర్డు

పెద్దపల్లి బోర్డు

పెద్దపల్లి లోక్‌‌సభ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగితే, అన్నిసార్లూ నాన్ లోకల్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ సారి కూడా ప్రధాన ప్రత్యర్థులు ఇతర ప్రాంతాలకు చెందిన వారే.

    పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. పారిశ్రామికంగా ముందంజలో ఉన్న దీన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఓ వైపు సింగరేణి సిరులు, మరో వైపు ఎన్టీపీసీ వెలుగులు, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, (ఎఫ్‌సీఐ) ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఇలా పెద్ద పెద్ద పారిశ్రామిక వనరులు ఉన్నాయి. దీని పరిధిలో పెద్దపల్లి, చెన్నూర్, బెల్లంపల్లి , మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. ఎస్సీలకు రిజర్వ్ అయిన పెద్దపల్లిలో ప్రధాన పార్టీలు బయటి నుంచి నేతలను తీసుకొచ్చి బరిలో నిలిపాయి. నిలుపుతున్నాయి. 1960కి ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న తెలంగాణ ప్రజా సమితి నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 16 సార్లు జరిగిన ఎన్నికల్లో పోటీలో నిలిచిన ప్రధాన ప్రత్యర్థులు 28 మంది ముఖ్య నాయకుల్లో ఇద్దరు తప్ప మిగతా వారంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేసిన వారే.

    పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఆర్‌.కృష్ణ హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతానికి చెందిన వారు. అంతకు ముందు కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీపీఎస్‌ నుంచి రెండు సార్లు గెలిచిన అనంతరం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడటంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1962, 1967 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 1971 ఎన్నికల్లో ఓటమి పాలైన ఎం.ఆర్‌.కృష్ణ ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు.


    1971లో టీపీఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన వి.తులసీరాం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎం.ఆర్‌.కృష్ణ పై గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌ ప్రాంతానికి చెందిన తులసీరాం టీపీఎస్‌ నుంచి మొదటి సారి పోటీ చేసి గెలుపొందిన అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. రెండు సార్లు వరుసగా గెలుపొందిన తులసీరాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

    జి.వెంకటస్వామి (File)


    1980లో జరిగిన ఎన్నికల్లో కోదాటి రాజమల్లు విజయం సాధించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం స్వస్థలమైన రాజమల్లు వృత్తిరీత్యా బెల్లంపల్లిలో పనిచేశారు. అంతకంటే ముందు చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోనే నివాసం ఉంటు రాజకీయంగా ఎదిగారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పోటీకి సూచించడంతో ఆయన తొలిసారిగా పార్లమెంటు స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన గొట్టె భూపతి 1984లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నాయకత్వం పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయన తంగళ్లపల్లి నుంచి వలస వచ్చి బరిలో నిలిచారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తన స్వస్థలం నేరెళ్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేశారు.


    కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకునిగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జి.వెంకటస్వామి పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా 1989లో పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి అప్పటికే మూడు సార్లు సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఎస్సీ రిజర్వేషన్‌ తొలగించడంతో పెద్దపల్లికి వలస వచ్చారు. తొలిసారిగా 1989లో గెలుపొందిన వెంకటస్వామి, 1991, 1996ల్లో వరుసగా విజయాన్ని అందుకున్నారు. మళ్లీ 2004లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వెంకటస్వామి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.

    కాంగ్రెస్ వైపు చూస్తున్న మాజీ మంత్రి వినోద్
    కేసీఆర్‌తో వివేకానంద


    1998లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన చెలిమెల సుగుణకుమారి అప్పటికే రాజకీయంగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న వెంకటస్వామిని ఓడించి చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన సుగుణకుమారి వృత్తిరీత్యా వైద్యురాలు. రాజధానిలో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను టీడీపీ నాయకత్వం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తొలిసారిగా 1998లో బరిలోకి దించింది. తొలి పోటీలోనే విజయం సాధించిన సుగుణకుమారి ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లోనూ గెలుపొందారు. రెండు సార్లు వెంకటస్వామిని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామి చేతిలోనే ఓడిపోవడంతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

    2009లో జరిగిన ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన జి.వివేక్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వివేక్‌ తొలి ఎన్నికల్లోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వివేక్‌ తండ్రి వెంకటస్వామి రాజకీయ వారసునిగా బరిలో నిలిచిన వివేక్‌ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.


    2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా చురుకైన పాత్ర పోషించిన బాల్క సుమన్‌ పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన సుమన్‌ విద్యార్థి నాయకునిగా హైదరాబాద్‌లోనే తన కార్యకలాపాలు సాగించారు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించడంతో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన సుమన్‌ భారీ మెజారీటీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.

    కేటీఆర్, వెంకటేశ్ నేతకాని


    అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో చెన్నూర్‌ అసెంబ్లీ మినహా నువ్వా నేనా అనేలా పోటీ కొనసాగింది. దీంతో పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో సహా ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ వివేక్‌ టీఆర్ఎస్ టికెట్ ఆశించి, గులాబీ బాస్ ఆదరించకపోవడంతో వెనుదిరిగారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బరీలో ఉన్న వెంకటేశ్ నేత ఉద్యోగానికి రాజీమానా చేసి రాజకీయల్లోకి వచ్చారు. స్థానికంగా చురుక్కుగా ఉండే అభ్యర్థికి బీజేపీ టిక్కెట్ ఖరారు చేసింది. సీనియర్ జర్నలిస్టు గా పనిచేసిన ఎస్. కుమార్ కు రాజకీయ లపై మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్‌ పేరును పార్టీ ఖరారు చేసింది. వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అనూహ్యంగా ఇక్కడి స్థానంలో పోటీ చేయించేలా అధిష్ఠానం నిర్ణయాన్ని తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్నారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు.

    ప్రత్యర్థులూ ఇతర ప్రాంతాల వారే!
    ఇప్పటి వరకు పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన ప్రత్యర్థులు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారే. విజేతల చేతిలో ఓడిపోయిన నాయకులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వారే ఉన్నారు. తొలి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సీపీఐ అభ్యర్థి పలణివేలు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు. రెండు సార్లు ఎం.ఆర్‌.కృష్ణ చేతిలో ఓడిపోయారు. ఇక్కడి నుంచి 1977లో బీఎల్డీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బంగారు లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు చెందిన వారే. 1984లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గంట శ్రీహరి కరీనంగర్‌ ప్రాంత వాసి. 1991, 1996ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య స్వగ్రామం జగిత్యాల మండలం అంతర్గాం. 1980లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పర్స రాజలింగు మాత్రమే గోదావరిఖనికి చెందిన వారు కాగా, 2009లో మహాకూటమి (టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస్‌ కాటారం మండలానికి చెందిన వారు. కేవలం ఇద్దరు మాత్రమే పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నివాసం ఉన్న వారే పోటీ చేశారు. అయితే ఆ ఇద్దరు కూడా విజయం సాధించలేకపోయారు. ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

    నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
    1962-67 ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
    1967-71 ఎం.ఆర్.కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
    1971-77 వి.తులసీరాం తెలంగాణా ప్రజా సమితి
    1977-80 వి.తులసీరాం భారత జాతీయ కాంగ్రెస్
    1980-84 జి.భూపతి తెలుగుదేశం పార్టీ
    1984-89 జి.భూపతి తెలుగుదేశం పార్టీ
    1989-91 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
    1991-96 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
    1996-98 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
    1998-99 డా. చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ
    1999-04 డా. చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ
    2004-09 జి.వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
    2009-14 జి. వివేకానంద్ భారత జాతీయ కాంగ్రెస్
    2014 -19 బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి

    (వేణుగోపాల్, కరీంనగర్ రిపోర్టర్, న్యూస్‌‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Lok Sabha Election 2019, Peddapalle S29p02, Telangana Lok Sabha Elections 2019, Tpcc, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు