TELANGANA LOK SABHA ELECTIONS 2019 TRS IS NOT AGENT FOR ANY PARTY SAYS CM KCR SK
ఎవరికీ ఏజెంట్లం కాదు..ప్రజలే మాకు బాస్: సంగారెడ్డి సభలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (File)
దేశం బాగుపడాలంటే కేంద్రంలో మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలిస్తే..భారతదేశ గతిని మార్చేందుకు కృషిచేస్తానని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ ఎవరికీ ఏజెంట్ కాదని స్పష్టంచేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రజలే తమ బాస్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని..ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేకపోయాయని విమర్శించారు. మోదీ ఐదేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని ధ్వజమెత్తారు తెలంగాణ సీఎం. దేశం బాగుపడాలంటే కేంద్రంలో మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలిస్తే..భారతదేశ గతిని మార్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా సంగారెడ్డిలో టీఆర్ఎస్ సభ జరిగింది. ఈ సభకు హాజరైన సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉంది. దేశంలోనూ ఇదే పరిస్థితి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. మోదీని రాహుల్ గాంధీ దొంగ అంటారు. రాహల్‌ని మోదీ దొంగ అంటారు. ఈ తమాషా ఏంది? ఈ రెండు పార్టీలే దేశాన్ని పాలించాయి. ఇద్దరు తప్పులు చేసి ఇప్పుడు బజారులో దిగి గడబిడ చేస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు దాటిపోయింది. ప్రజల కనీసం అవసరాలు కూడా తీర్చలేకపోయారు. అందరికీ విద్య, వైద్యం, మంచినీరు, కరెంటు, ఇళ్లు కావాలి. కానీ ఇప్పటికీ తీరలేదు.
— కేసీఆర్, తెలంగాణ సీఎం
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. రైతు బంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయి. దేశమంతా ఇలా జరగలాంటే మంచి ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను మనం చూశాం. ఐదేళ్లలో మోదీ కూడా ఏమీ చేయలేదు. మోదీ ఐదేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అయింది. మనం బీజేపీతో కలిశామని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిశామని మోదీ అంటున్నారు. మనం ఎవ్వరితోనే కలవలేదు. మన బతకు బతుకుతున్నాం. ఎవ్వరితో కలవాల్సిన అవసరం లేదు. మేం తెలంగాణ ప్రజలకు ఏజెంట్లం. ప్రజలే మాకు బాస్‌లు. లోపాయికారీ రాజకీయం చేసే అవసరం మాకు లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. భారతదేశ గతిని మార్చేందుకు కృషిచేస్తాం.
— కేసీఆర్, తెలంగాణ సీఎం
కాళేశ్వరం పూర్తయితే నియోజకవర్గంలో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు కేసీఆర్. జహీరాబాద్‌లో నిమ్స్ నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి, కామారెడ్డికి లిఫ్ట్‌ల ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.