Home /News /politics /

TELANGANA LOK SABHA ELECTIONS 2019 I DONT DESIRE PM POST SAYS CM KCR IN WARANGAL PUBLIC MEETING SK

ప్రధాని కావాలనే కోరిక లేదు..ఢిల్లీని మేమే సాదుతున్నాం: వరంగల్ సభలో కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

కాంగ్రెస్, బీజేపీ లేని కూటమి దేశానికి కావాలన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ పార్లమెంటరీ స్థానంలో పసునూరి దయాకర్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

  ప్రధాని కావాలన్న కోరిక తనకు లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వరంగల్ అజాంజాహీ మిల్లులో సభపెట్టిన నేతలంతా ప్రధాని అవుతారని ఎంపీ పసునూరి దయాకర్ చెప్పారని..కానీ తనకు ఆ కోరిక లేదని చెప్పారు. ఐతే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుందని చెప్పారు కేసీఆర్. వరంగల్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన తెలంగాణ సీఎం.. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 16 సీట్లు ఇవ్వాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఒరిగేదేం ఉండదని స్పష్టచేశారు కేసీఆర్.

  తెలంగాణ దేశానికే ఆదర్శం
  ఐదేళ్ల కింద తెలంగాణ ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. వ్యవసాయానికి 24 గంటల ఉచితంగా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బీమా, రైతు బంధు, పెన్షన్ల విషయంలో దేశానికే ఆదర్శంగా ఉన్నాం. ఈ ఏడాదిలోనే కాళేశ్వరం పూర్తవుతుంది. కాకతీయ కాల్వలో నిత్యం నీళ్లుంటాయి.

  2 నెలల్లో కొత్త రెవిన్యూ చట్టం
  పట్టా భూముల విషయంలో పలు సమస్యలున్నాయి. రైతులు భూముల విషయంలో దేశంలో ఎవ్వరూ చేయని సాహసం చేశాం. పాస్‌బుక్కులను మార్చాం. రాబోయే రెండు నెలల్లో కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తాం. ప్రతి జిల్లాకొచ్చి ప్రజా దర్బార్ ఏర్పాటుచేసి భూ సమస్యలను పరిష్కరిస్తాం. నేను స్వయంగా ఆ పనిచేస్తా. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వొద్దు.

  వనరులు వాడే తెలివి లేదు
  కాంగ్రెస్, బీజేపీలు ఒకరిని ఒకరు తిట్టుకుంటారు తప్ప ఏమీ చేయరు. ఎన్డీయే 11 ఏళ్లు, కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించారు. మరి ఇన్నేళ్లు ఏం చేశారు. ప్రధాని మంత్రి దొంగ అని ఒకరంటారు. తల్లీకొడుకుల బెయిల్‌పై తిరుగుతున్నారని మరొకరు అంటారు. వీళ్లా మనకు కావాల్సింది. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లున్నా, 4.40 లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నా వాడుకోలేకపోతున్నాం. దీనిపై రాహుల్, మోదీ సమాధానం చెప్పరు. యువ శక్తిని వాడే తెలివి కూడా లేదు.

  16 మంది మనోళ్లే గెలవాలి
  తెలంగాణ కోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిచినా ఢిల్లీ ముందు గులాం అవుతారు. ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేశంలో పేదరికం పోవాలె. నిరుద్యోగం సమస్య పోవాలె. రైతుల పంటకు గిట్టుబాటు ధర కావాలె. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

  ప్రధాని పదవిపై ఆశ లేదు
  ప్రధాన మంత్రి ఎవ్వరైనా కానీయండి. వరంగల్ అజాంజాహీ మిల్లులో సభపెట్టిన నేతలంతా ప్రధాని అవుతారని ఎంపీ పసునూరి దయాకర్ చెప్పారు. కానీ ప్రధాన మంత్రి కావాలనే కోరిక నాకు లేదు. గెలవాల్సింది..పార్టీలు, వ్యక్తులు కాదు . ప్రజల అభిమతం గెలవాలి. రాష్ట్రాల హక్కులు అధికారాలను లాక్కున్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనమే రావాలి. పాక్ సమస్య, విదేశాంగ విధానాన్ని పట్టించుకోరు. రాష్ట్రాల మీద పడి చిల్లర రాజకీయాలు మాత్రం చేస్తారు. ప్రధాని మోదీ సర్పంచ్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు.

  ఢిల్లీని మేమే సాదుతున్నాం
  తెలంగాణకు కేంద్రం రూ.35వేల కోట్లు ఇవ్వలేదు. ఢిల్లీ మనల్ని సాదడం లేదు. మనమే ఢిల్లీని సాదుతున్నాం. ఎక్సైజ్, కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, జీఎస్టీ, ఐటీ రూపంలో ఏడాదికి రూ.లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కానీ ఢిల్లీ నుంచి తిరిగొచ్చేది రూ.24వేల కోట్లు మాత్రమే. దేశాన్ని సాదే రాష్ట్రాలు ఐదారు మాత్రమే ఉన్నాయి. అందులో మన తెలంగాణ కూడా ఉంది. అది తప్పని అంటలేం. పిచ్చిపిచ్చి మాటలు, అబద్ధాలు మాట్లాడొద్దని చెబుతున్నాం. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

  కాంగ్రెస్, బీజేపీలు లేని కూటమి దేశానికి కావాలన్నారు సీఎం కేసీఆర్. వరంగల్ పార్లమెంటరీ స్థానంలో పసునూరి దయాకర్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలని..అప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టంచేశారు.
  First published:

  Tags: CM KCR, Lok Sabha Election 2019, Pm modi, Rahul Gandhi, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు