Gound Report: సికింద్రాబాద్‌లో హోరాహోరీ..త్రిముఖ పోరులో విజయం ఎవరిది?

కిషన్ రెడ్డి, అంజన్ కుమార్, తలసాని సాయికిరణ్

సికింద్రాబాద్‌లో మైనారిటీలు, బీసీలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకున్నారు.

 • Share this:
  సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది . ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీలూ బరిలో వున్నాయి.  ప్రస్తుతం బీజేపీ జెండా ఎగురుతున్న ఈ  పార్లమెంటరీ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.  గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ అభ్యర్ధి అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయను కాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డిని రంగంలోకి దింపింది క‌మ‌ల ద‌ళం. దీంతో ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండగా, నాంపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది.

  టీఆర్‌ఎస్ పార్టీ పెట్టింది మొద‌లు ఇప్పటి వరకూ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలవలేదు. తొలిసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది గులాబీ దళం. దీని పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం  తమకు కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడం సానుకూలాంశంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయానికి దోహదపడతాయని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ఈ స్థానం నుంచి మొదటిసారి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. మ‌రోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నీ తానై కుమారుడిని గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు.

  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఏ తీర్పు ఇచ్చారో చూశాం. ఇప్పుడు కూడా ప్ర‌జ‌లు టీఆర్‌ఎస్‌కే ప‌ట్టంక‌ట్ట‌బోతున్నారు.
  న్యూస్ 18 తో త‌ల‌సాని సాయికిర‌ణ్


  తలసాని సాయికిరణ్ యాదవ్ ప్రచారం


  అటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయ‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు ఎంపీగా గెలిచిన అనుభవం, తనకున్న పరిచయాలు ఈసారి విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్‌ అభ్యర్ధి అంజన్‌కుమార్‌ యాదవ్‌ భావిస్తున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకున్న ఆయన ఇప్పటికే నియోజక వర్గంలో కలియతిరుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు సికింద్రాబాద్‌ సీటును కానుకగా ఇవ్వాలన్న నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పార్టీ ప్ర‌చారానికి సోనియాని తీసుకురావ‌డానికి అంజన్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్ త‌మ పార్టీ నేత‌ల‌ను ఎలా కొనుగోలు చేసిందో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం ద్వార త‌న విజ‌యం కాస్త సుల‌భ‌త‌రం అవుతుంద‌ని భావిస్తోన్నారు అంజ‌న్ కుమార్ యాద‌వ్

  సికింద్రాబాద్‌లో మరోసారి జెండా ఎగురవేసేందుకు బీజేపీ పావులు కుదుపుతోంది. త‌మ పార్టీకి బ‌లం ఉన్న స్థానం కావడంతో విజ‌యంపై కిష‌న్‌రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా కిషన్‌ రెడ్డికి పేరుంది. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీచేసి కిషన్ రెడ్డి ఓడిపోయారు. ఆ చేదు అనుభవాన్ని అధిగమించాలన్న కసితో ఆయన ఉన్నారు.

  సికింద్రాబాద్ స్థానంలో మ‌ళ్లీ బీజేపీయే గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ డ‌బ్బుని న‌మ్ముకొని బరిలో ఉంది. కానీ మేం ప్రజల నమ్మకాన్ని నమ్ముకున్నామన్నారు. ప్ర‌ధాని మోదీ స‌భ‌ల‌తో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ 16 సీట్లు గెలిచినా ఒరిగేదేం ఉండదు.
  కిషన్ రెడ్డి


  2014లో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా పోటీలో నిలిచిన బండారు దత్తాత్రేయ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌పై 2,54,735 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకు ముందుకు వరుసగా 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్.. గత ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో అంజన్ కుమార్ సమీప బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 1, 70, 167 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 19,54,813 ఓటర్లు ఉన్నారు. మైనారిటీలు, బీసీలు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరి ఈ త్రిముఖ పోరులో విజేతలెవరో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

  (బాల‌కృష్ణ‌.ఎమ్, న్యూస్18 సీనియ‌ర్ క‌రెస్పాండెంట్)
  First published: