ఆ స్థానాలపైనే కాంగ్రెస్ ఆశలు.. హస్తం పార్టీ లెక్కలు ఇవే..

గ్రామీణ ప్రాంతాల్లోని కేడర్‌లో నెలకొన్న నైరాశ్యం తమ పుట్టి ముంచే అవకాశాలున్నాయని, ప్రచారం సరిగ్గా జరగని లోక్‌సభ స్థానాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన విధంగా పోలింగ్‌ జరగలేదని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: April 12, 2019, 10:14 PM IST
ఆ స్థానాలపైనే కాంగ్రెస్ ఆశలు.. హస్తం పార్టీ లెక్కలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో లోక్‌‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చ జోరుగా సాగుతోంది. 16 సీట్లు గెలుస్తామని అధికార పార్టీ టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా..కాంగ్రెస్ సైతం ఫలితాలపై అంచనాలు వస్తోంది. పోలింగ్‌ సరళిని బట్టి 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చామని.. 3-4 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు. 8 స్థానాల్లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయామని భావిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, ఖమ్మం, ఆదిలాబాద్, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్‌గిరి స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గట్టిగానే ఎదుర్కొన్నామనే ధీమా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్‌ స్థానాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ స్థానాల్లో పూర్తిగా వెనుకబడిపోయామనే భావన పోలింగ్‌ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. ఇక చేవెళ్ల, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్‌గిరి స్థానాల్లో కాంగ్రెస్ తప్పకుండా జెండా ఎగరవేస్తోందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి జరిగిన వలసల కారణంగా కుదేలైన కాంగ్రెస్‌ పార్టీ.. ఆ తర్వాత కోలుకోలేకపోయిందని ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోవడంతో గ్రామాల్లో కేడర్‌ను కదలించే నాథుడే లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి తోడు లోక్‌సభ ఎన్నికల తరుణంలో నేతలంతా పార్టీని వీడటంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా పెద్దగా ఉత్సాహం కనిపించలేదని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), రేవంత్‌రెడ్డి (మల్కాజ్‌గిరి)మాత్రమే ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు ధీటుగా దూసుకెళ్లినట్టు కనిపించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయారు.

స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ నేతలు, కేడర్‌లో పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నా.. ప్రధానంగా నాలుగు అంశాలు తమను ఆదుకుంటాయనే ధీమా కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష, జాతీయస్థాయి ఎన్నికల్లో రాహుల్‌ కార్డుతో పాటు మోదీపై ఉన్న వ్యతిరేకత, పోటీలో ఉన్న అభ్యర్థుల చరిష్మా తమకు కలిసివస్తుందని చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాల్లో కాంగ్రెస్‌ నేతలున్నారు. ఈ కోణంలోనే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తమకు అనుకూలంగా జరిగిందని అంటున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని కేడర్‌లో నెలకొన్న నైరాశ్యం తమ పుట్టి ముంచే అవకాశాలున్నాయని, ప్రచారం సరిగ్గా జరగని లోక్‌సభ స్థానాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన విధంగా పోలింగ్‌ జరగలేదని అంచనా వేస్తున్నారు.

ఇక నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో చరిష్మా ఉన్న నేతలు బరిలో ఉన్నందున తమ ఓటు బ్యాంక్‌తో పాటు సామాజిక సమీకరణలు, స్థానిక అంశాలు లాభం చేకూరుస్తాయని అంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయా... ఆదిలాబాద్‌లో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తమ అభ్యర్థికి సామాజిక సమీకరణలు మేలు చేకూరుస్తాయా.. లాంటి విశ్లేషణలు కూడా పార్టీ నేతల్లో జరుగుతున్నాయి. ఐతే ఎవరి లెక్కలు ఉన్నా..ఓటర్లు ఇప్పటికే తమ ఓటును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధిస్తుంది? కారు పదహారు గెలుస్తుందా? వంటి ప్రశ్నలకు మే 23నే సమాధానం రానుంది.(బాలకృష్ణ, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18)
First published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు