TELANGANA LOK SABHA ELECTIONS 2019 BHONGIR LOK SABHA CONSTITUENCY PROFILE AK
Your Parliament: భువనగిరిలో గెలిచేదెవరు ? టీఆర్ఎస్ వర్సెస్ కోమటిరెడ్డి
ప్రతీకాత్మక చిత్రం
భువనగిరి నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీఆర్ఎస్... గెలవాలని పట్టుదలగా పోరాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్... వెరసి భువనగిరి లోక్ సభ ఎన్నికలను రసవత్తరంగా మార్చేశాయి.
తెలంగాణలో తమ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తున్న నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. మిగతా స్థానాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థి బరిలో నిలిచారు. మాజీమంత్రి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఈ సారి భువనగిరి నుంచి లోక్ సభ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా అనుచరగణం ఉన్న కోమటిరెడ్డి సోదరులు... భువనగిరి ఎంపీ సీటును మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన ఈ స్థానం నుంచి ఈ సారి తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
2009లో ఏర్పడిన భువనగిరి
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్ సభ స్థానం ఏర్పడింది. అప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండతో పాటు మిర్యాలగూడ లోక్ సభ స్థానాలు ఉండేవి. అయితే పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ లోక్ సభ సీటు కనుమరుగై... భువనగిరి లోక్ సభ స్థానం ఆవిర్భవించింది. భువనగిరి లోక్ సభ పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
2009లో తొలిసారి భువనగిరి లోక్ సభ సీటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనవిజయం సాధించారు. అప్పట్లో సీపీఎం అభ్యర్థిగా ఉన్న నోముల నర్సింహయ్యపై రాజకీయ అరంగ్రేటం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరాజయం ఎదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ చేతిలో 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
నియోజకవర్గంలో ‘కోమటిరెడ్డి’ పట్టు
అయితే ఓడిపోయినా... భువనగిరి నియోజకవర్గంలో వీరి పట్టు కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. నకిరేకల్ నుంచి వీరి అనుచరుడు చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఆయన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల మెజార్టీతో పరాజయం పాలైంది. దీంతో ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఓ సారి గెలిచి, మరోసారి ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... తన సోదరుడు వెంకట్ రెడ్డిని గెలిపించుకుని నియోజకవర్గంపై పట్టు కొనసాగించాలని భావిస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్
మరోవైపు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్ నాయకత్వమే తనను గెలిపిస్తుందని సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నమ్మకంగా ఉన్నారు. నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా టీఆర్ఎస్ ఖాతాలోనే ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కూడా బూర నర్సయ్య గౌడ్ విజయానికి కృషి చేస్తున్నారు.
బూర నర్సయ్య గౌడ్
ఇక భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన అనేక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గం పరిధిలోని ఎయిమ్స్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. నియోజకవర్గం పరిధిలోని అనేక ప్రాంతాలకు సాగునీరు లేదు. ఇంకా అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో ఇక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతారా లేక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జై కొడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.