Amit Shah: నేడు తెలంగాణకు హోంమంత్రి అమిత్ షా.. నిర్మల్‌లో భారీ బహిరంగ సభ

అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah Nirmal Tour: అమిత్ షా కేవలం విమోచన దినోత్సవం గురించే మాట్లాడతారా? లేదంటే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చుతారా? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్‌పై ఎంత తీవ్రంగా విరుచుకుపడితే.. తమకు అంత లాభం కలుగుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

 • Share this:
  నేడు సెప్టెంబరు 17. తెలంగాణ (నాటి హైదరాబాద్ స్టేట్) భారతదేశంలో విలీనమయిన రోజు (Telangana Liberation day). ఐతే దీనిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కొందరు విలీన దినోత్సవమంటే.. మరికొందరు విద్రోహ దినంగా భావిస్తారు. మరికొందరు విమోచన దినోత్సవంగా పాటిస్తారు. ఐతే ఎంతో ఘన చరిత్ర ఉన్న సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మజ్లిస్ పార్టీకి తలొగ్గే.. తెలంగాణ ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ముందు నుంచీ కాషాయ పార్టీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిర్మల్‌లో ఉరులమర్రి ప్రాంతాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి నాందేడ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్‌ చేరుకుంటారు అమిత్ షా. ఈ సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

  ఇవాళే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కూడా ఉండడంతో నిర్మల్‌లో రక్తదాన శిబిరాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 02.45 నిమిషాలకు నిర్మల్‌లోని క్రూజర్ గ్రౌండ్‌లో జరగనున్న బీజేపీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. నైజాం పాలనలో రజాకార్ల చేతితో వేయి మందిని ఉరితీసిన ఉరులమర్రిలో ఈ సభ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబరు 17 చరిత్రను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో.. హోంమంత్రి అమిత్ షా ఏం మాట్లాడతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవంపై కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన పర్యటనపై ఫోకస్ పెట్టాయి. బహిరంగ సభ అనంతరం అమిత్ షా నాందేడ్ మీదుగా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని బీజపీ వర్గాలు పేర్కొన్నాయి.

  Telangana News: దారుణ ఘటన.. ఒక్క మర్రిచెట్టుకు.. వెయ్యి మంది ఉరితీత.. అసలు ఆరోజు ఏం జరిగింది..


  TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు

  కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించారు. ఐతే ఆ పర్యటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. టీఆర్ఎస్, బీజేపీ గల్లీలోనే కొట్టుకుంటాయని.. డిల్లీలో మాత్రం రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని మండిపడింది. ఇది టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో నేడు నిర్మల్ సభకు వస్తున్న అమిత్ షా.. టీఆర్ఎస్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడతారన్నది చర్చనీయాంశమయింది. కేవలం విమోచన దినోత్సవం గురించే మాట్లాడతారా? లేదంటే టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చుతారా? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్‌పై ఎంత తీవ్రంగా విరుచుకుపడితే.. తమకు అంత లాభం కలుగుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలతో కాంగ్రెస్ వంటి పార్టీల నోరు మూతపడటంతో పాటు తమ పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకుంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: