డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చు అనే సూత్రం అందరి విషయంలోనూ వర్కౌట్ కాదు. వార్డు మెంబర్‌గా గెలిచేందుకు భారీగా ఖర్చు పెట్టిన ఓ అభ్యర్థి.. తీరా ఓడిపోవడంతో తన డబ్బు తనకు ఇచ్చేయాలని ఓటర్లకు ఇళ్లకు వెళ్లడం గమనార్హం.
గల్లీ స్థాయి ఎన్నికలైనా.. ఢిల్లీ స్థాయి ఎన్నికలైనా.. ఎన్నికలంటే చాలు.. డబ్బు, మద్యం ఏరులై పారాల్సిందే. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు ఇంటింటికి తిరిగి మరీ ప్రలోభాల పర్వం మొదలుపెడుతారు. ఎన్నికల్లో గెలవడానికి తమ సమర్థత, విశ్వసనీయత కన్నా ప్రలోభాలే పెద్ద పెట్టుబడి అనేది వారి నమ్మకం. అయితే ఆ నమ్మకం అడ్డంగా బోల్తా కొడితే మాత్రం సీన్ భలే సిత్రంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డి గూడెంలో ఇదే జరిగింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. గ్రామంలోని ఓ వార్డులో కాంగ్రెస్ నాయకురాలు ఉప్పు హైమావతి పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు భారీగానే డబ్బు ఖర్చు పెట్టారు. ఒక్కో ఓటరుకు రూ.500-రూ.700 వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతా చేస్తే.. ఎన్నికల్లో ఆమెకు కేవలం 24 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో హైమావతి భర్త ప్రభాకర్‌కు తిక్క రేగింది. ఒక్కో ఓటుకు అంత ఖర్చు పెడితే.. ఇదా దక్కిన ఫలితం అని ఆగ్రహానికి గురయ్యాడు.
అంతేకాదు, ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమ డబ్బు తమకు ఇచ్చేయాల్సిందిగా వారిని డిమాండ్ చేశాడు. తొలుత వారిని మర్యాదగా అభ్యర్థించిన ప్రభాకర్.. ఆపై డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీయడంతో అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రభాకర్ తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు.. అంతా ఏకమై అతన్ని తరిమేసినట్టు సమాచారం. మొత్తానికి డబ్బే ఎన్నికల్లో గెలిపిస్తుందని భావించిన హైమావతి-ప్రభాకర్ దంపతులు.. ఎన్నికల్లో ఓడిపోవడంతో పెద్ద షాక్ తిన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.