జగదీష్ రెడ్డికి కలిసిరాని విద్యాశాఖ.. మంత్రికి పదవీగండం?

2014 - 2018 మధ్యకాలంలో జగదీష్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత కేసీఆర్ విద్యాశాఖను కడియం శ్రీహరికి అప్పగించారు.

news18-telugu
Updated: April 23, 2019, 6:22 PM IST
జగదీష్ రెడ్డికి కలిసిరాని విద్యాశాఖ.. మంత్రికి పదవీగండం?
జగదీష్ రెడ్డి (File)
news18-telugu
Updated: April 23, 2019, 6:22 PM IST
తెలంగాణలో ఇంటర్ బోర్డు వివాదం మంత్రి జగదీష్ రెడ్డి పదవికి చేటు తెచ్చేలా ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ బోర్డులో గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో దుమారం రేగింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాంతింపజేసేందుకు మంత్రి సర్దిచెప్పినా, ఘటనపై త్రిసభ్య కమిటీ వేసినా.. అవి ఆయనకు ఊరట కల్పించే అవకాశం కలగడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేబినెట్‌ను విస్తరించేందుకు అవకాశం ఉంది. ఈ విస్తరణలో జగదీష్ రెడ్డికి పదవికి గండం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

గతంలో కూడా జగదీష్ రెడ్డి విద్యాశాఖను నిర్వహించారు. అయితే, అప్పుడు పెద్దగా వివాదాలు బయటకు రాలేదు. కార్పొరేట్ విద్యాసంస్థలతో సన్నిహిత సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే గత ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా విద్యాశాఖను జగదీష్ రెడ్డి నుంచి మార్చి కడియం శ్రీహరికి అప్పగించారు. గతంలో అనుభవాలను గమనించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏరికోరి జగదీష్ రెడ్డికి మంత్రిపదవి ఇచ్చి విద్యాశాఖను అప్పగించారు. కానీ, ఈసారి ఆరంభంలోనే పెను వివాదం చుట్టుముట్టింది. ఈ వివాదం ఎటు తిరుగుతుంది? మంత్రి జగదీష్ రెడ్డికి పదవి మార్పు జరుగుతుందా? ఏకంగా పదవీగండం ఉంటుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

మరోవైపు ఇంటర్ బోర్డు వైఫల్యం మీద ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద మెతకవైఖరి అవలంభిస్తున్నారంటూ మండిపడుతున్నాయి.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...