TELANGANA HIGHCOURT UNHAPPY ON CHIEF SECRETARY REPORT OVER TSRTC STRIKE MS
TSRTC Strike : హైకోర్టు విచారణ.. ప్రభుత్వ నివేదికలపై న్యాయస్థానం అసంతృప్తి..
ప్రతీకాత్మక చిత్రం
TSRTC Strike : మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద రూ.453కోట్లు ఆర్టీసీయే ప్రభుత్వానికి బకాయి పడిందని ప్రభుత్వం అఫిడవిట్స్ దాఖలు చేసిన నేపథ్యంలో.. అధికారులు స్వయంగా దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ,ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విచారణకు హాజరయ్యారు.మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద రూ.453కోట్లు ఆర్టీసీయే ప్రభుత్వానికి బకాయి పడిందని ప్రభుత్వం అఫిడవిట్స్ దాఖలు చేసిన నేపథ్యంలో.. అధికారులు స్వయంగా దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలను పరిశీలించి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.రెండు నివేదికలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది. ఐఏఎస్ స్థాయి అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. అయితే రికార్డులు పరిశీలించాకే సమగ్ర నివేదిక అందించామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు. కానీ కోర్టు మాత్రం వారి వాదనలతో సంతృప్తి చెందలేదు.
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని కోర్టు పేర్కొనగా.. 02-06-2014 నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను నివేదిక ద్వారా సమర్పించినట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు. అయితే హైకోర్టు మాత్రం సునీల్ శర్మపై తీవ్ర స్థాయిలో స్పందించింది. తన 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంత అబద్దాలు చెప్పే అధికారులను
ఎక్కడా చూడలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రులు,ముఖ్యమంత్రులను సైతం అబద్దపు లెక్కలతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సమర్పించిన లెక్కలన్నీ కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, నేటి హైకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆర్టీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే సరిపోదని.. కేంద్రం ఆమోదం లేకుండా అది అసాధ్యమని ఆయన చెబుతున్నారు. ఆర్టీసీలో 31శాతం వాటా ఉన్న కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.