ఓ సామాన్య వ్యక్తి కొడుకు.. ఓ ప్రజాప్రతినిధి కొడుకు.. ఒకే స్కూల్లో చదువుకునే పరిస్థితి ఇండియాలో సాధ్యపడుతుందా?.. మైకుల ముందు సమానత్వ ఆదర్శాలపై టన్నుల కొద్ది స్పీచులు దంచడమే తప్పించి.. ఆచరణకు మాత్రం మన నాయకులు ఆమడ దూరంలో ఉంటారు. అందుకే తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధులపై అక్షింతలు వేసింది. అసలు ఎంతమంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారని ప్రశ్నించింది.
పిటిషన్ విచారణ సందర్భంగా కేరళలో విద్యా ప్రమాణాల గురించి చీఫ్ జస్టిఫ్ తొట్టథిల్ గుర్తుచేశారు. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వోద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకే పంపిస్తారని చెప్పారు. తల్లిదండ్రులకు-ఉపాధ్యాయులకు మధ్య సరైన అసోసియేషన్ ఉంటే తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెరుగుతుందన్నారు.
వెంకట్ రెడ్డి పిటిషన్పై ప్రభుత్వం తరుపున ప్రతివాదనలు వినిపించిన న్యాయవాది వాణిరెడ్డి.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరుపున అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను అందులో వివరించారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల పరిస్థితిపై మూడు వారాల్లోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాల్సిందిగా విచారణ అనంతరం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ల స్థితి గతులపై నివేదిక రూపొందించాలని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Telangana, Telangana News