Home /News /politics /

TELANGANA HIGH COURT ON PETITIONS FILED AGAINST CM KCR NAGARJUNA SAGAR MEETING SU

CM KCR: నాగార్జున సాగర్‌లో కేసీఆర్ సభకు అడ్డంకులు తొలగినట్టేనా..? సభ ఆపాలన్న పిటిషన్లపై హైకోర్టు ఏమందంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

Nagarjunasagar bypoll: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 14న తలపెట్టిన సభను ఆపాలని దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది.

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నాగార్జున్ సాగర్‌లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌ ఎన్నికల నేపథ్యంలో హాలియాలో ఈనెల 14న సీఎం కేసీఆర్.. సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ సభను రద్దుచేయాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ కోరారు. మరోవైపు అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని రైతుల పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఈ క్రమంలోనే 14వ తేదీన హాలియా‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా? ఉండదా? అనే దానిపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సందిగ్దం నెలకొంది. అయితే ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ నిర్వహించబోతున్న బహిరంగ సభను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ల అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సైదయ్యతో పాటు మరికొందరు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి వద్ద సోమవారం విచారణకు వచ్చాయి. రోస్టర్ ఉన్న బెంచ్‌కు ఈ పిటిషన్‌లను బదిలీ చేయాలని రిజిస్ట్రీ‌కి న్యాయూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్వహించే సభ 14వ తేదీనే కావడంతో.. అడ్డంకులు తొలగినట్టేనని టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

    నాగార్జున సాగర్‌లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీఆర్‌ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ బరిలోకి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత జనారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ నాయక్ బరిలో నిలిచారు. ఇప్పటికే ప్రధాన పార్టీలన్ని ఓటర్లను ఆకర్షించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇక, ఏప్రిల్ 17 సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మే 2 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు