ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan Mohan Reddy), వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు (MP Raghurama Krishnam Raju) మధ్య కోర్టు సాక్షిగా వార్ కొనసాగుతోంది. సీఎం జగన్ బెయిల్ రద్దు (YS Jagan Bail Cancellation) చేయాలంటూ రఘురామకృష్ణం రాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఏపీ సీఎంకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయని కోర్టుకు తెలిపిన రఘురామ కృష్ణంరాజు.. బెయిల్ రద్దు చేసి సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై విచారణ వేగవంతం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో జగన్ తరపు న్యాయవాదులు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణం రాజు తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి దెబ్బతిన్న ఆయన ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. ఈ ఏడాది అక్టోబర్లో సుప్రీం కోర్టులో మరో పిటిషన్ కూడా వేశారు. సీఎంపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని పిటిషన్న రఘురామ.. క్రిమినల్ కేసులను ఏడాదిలోగా విచారించాలని గతంలో సుప్రీం ఆదేశాలిచ్చిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటకు రావాలని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ కేసులో ఏడేళ్ల పాటు విచారణ జరిపితే సుప్రీం తప్పుబట్టిందని.. కావున జగన్ పై ఉన్న కేసులను వేగంగా విచారణ జరిపితే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న నమ్మకంతో పిటిషన్ వేసినట్లు తెలిపారు. తమ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని త్వరగా ఋజువు కావాలనేదే తన ప్రయత్నమన్నారు. జగన్ పై దాఖలైన ఛార్జి షీట్లపై విచారణ 2200 సార్లకు పైగా వాయిదా పడినట్లు రఘురామ వెల్లడించారు.
ఇది చదవండి: వైసీపీలోని ఆ నేతల నుంచే జగన్ కు ప్రాణహాని.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణంరాజు... రచ్చబండ పేరుతో ప్రభుత్వపై మండిపడుతున్నారు. ఇసుక, మద్యం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, మంత్రుల భాష, మూడు రాజధానులు.. ఇలా పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారాయన. మరోవైపు తమ పార్టీ గుర్తుపై గెలిచి తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Telangana High Court