ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణం రాజు ఆయన భార్య రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని డైరెక్టర్లుగా ఉన్న ఇండో-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ తరపున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపింది. రఘురామ కృష్ణంరాజుకు చెందిన కంపెనీల బ్యాంక్ ఖాతాలను డీఫాల్టర్లుగా ప్రకటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చిన నేపథ్యంలో తమ కంపెనీలను మోసపూరిత కంపెనీలుగా ప్రకటించడాన్ని రఘురామ కృష్ణం రాజు కోర్టులో సవాల్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తె కూడా పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిల్ బి.విజయసేనరెడ్డిలతో కూడిన ధర్మాసనం.. ఆర్బీఐ ఆయనకు ఊరటినిస్తూనే సీబీఐ దర్యాప్తుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ కంపెనీలకు నోటీసులివ్వకుండా ఎలాంటి వివరణ తీసుకోకుండా ఆర్బీఐ ఉత్తర్వులలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన స్టే ను పొడిగించిన ధర్మాసనం.. ఆ ఉత్తర్వులు సీబీఐ విచారణకు ఏ విధంగానూ అడ్డుకాబోవని స్పష్టం చేసింది.
ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ తమ నుంచి రూ.30.94 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ ఎస్బీఎస్, ఐఓబీ, యాక్సిస్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆప్ బరోడా.. ఇండ్–భారత్ కంపెనీ ఎకౌంట్లను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి. మరో కేసులో ఆర్బీఐ సర్క్యులర్ తప్పుబడుతూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను జూలై 16 కి వాయిదా వేసింది.
గత ఏడాది అక్టోబర్ లో రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. రఘురామకృష్ణం రాజుకు చెందిన కంపెనీలు బ్యాంకులకు రూ.826 కోట్లు ఎగవేశాయన్న ఫిర్యాదుతో దేశంలో 11 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.