హోమ్ /వార్తలు /రాజకీయం /

Telangana MLC Elections: కోదండరామ్‌ ఆశలపై నీళ్లు.. TJSకి షాకిచ్చిన కాంగ్రెస్

Telangana MLC Elections: కోదండరామ్‌ ఆశలపై నీళ్లు.. TJSకి షాకిచ్చిన కాంగ్రెస్

కోదండరామ్ (పైల్ ఫోటో)

కోదండరామ్ (పైల్ ఫోటో)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరొక పార్టీకి మద్దతు ఇవ్వడం కంటే.. పార్టీ కోసం పనిచేసిన నేతలను బరిలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలకు నేతలు సూచించారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

  తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావిడి నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్), నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, నిజామాబాద్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ బరిలోకి దిగుతోంది. గెలుపుపైనా ధీమాగా ఉంది.

  ఐతే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంనుంచి పోటీచేసేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపకుండా.. తనకు మద్దతు తెలపాలని ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలతో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సమావేశమై పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం మద్దతిచ్చే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఐతే టీజేఎస్‌కు మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు.

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరొక పార్టీకి మద్దతు ఇవ్వడం కంటే.. పార్టీ కోసం పనిచేసిన నేతలను బరిలోకి దించాలని కాంగ్రెస్ పెద్దలకు నేతలు సూచించారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని.. ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్ధిని నిలబెడదామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంతో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని చెప్పారు. కోదండరాంను కూడా వదులుకోకూడదని పలువురు నేతలు మాణిక్యం ఠాగూర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. వారి విజ్ఞప్తిపై మాణిక్యం ఠాగూర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోదండరామ్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చిందన్న అభిప్రాయాలు తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి.

  కాగా, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. పట్టభద్రుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది నవంబర్‌ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి మూడేళ్లు పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

  అర్హులైన వారు అక్టోబర్‌ 1 నుంచి ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం పేర్కొంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో.. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 11 వరకు వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఓటరు నమోదుపై ఆయా జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Kodandaram, Telangana, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు