Home /News /politics /

TELANGANA GRADUATE MLC ELECTIONS 2021 POLLING ENDS IN ALL 6 DISTRICTS SK

Telangana: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్.. గెలిచేది ఎవరో..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana MLC Elections 2021: ఈసారి ఓటర్లు సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటు వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మార్చి 17న కౌంటింగ్ జరుగుతుంది.

    తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నల్గొండ-ఖమ్మం-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని కూడా భారీ స్థాయిలో నిర్వహించాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం దాటినా.. సాయంత్రం 4 గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం నుంచే పలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర పట్టభద్రులు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

    నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 93 మంది పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఉమ్మడి 6 జిల్లా పరిధిలో 1,530 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. మరికొన్ని కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. పోలింగ్ నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి మాస్క్, గ్లౌజులు సమకూర్చారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.

    హైదరాబాద్‌ నియోజకవర్గానికి 34/23 అంగుళాలు, నల్లగొండ నియోజకవర్గానికి 25/18 అంగుళాల పరిమాణంలో జంబో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించారు. దాదాపు న్యూస్ పేపర్ పరిమాణంలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు ఓటర్లు. మరికొందరైతే గందరగోళానికి గురయ్యారు. ఐతే ఈసారి ఓటర్లు సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటు వేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మార్చి 17న కౌంటింగ్ జరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Telangana, Telangana mlc election, Telangana Politics

    తదుపరి వార్తలు