news18-telugu
Updated: November 30, 2018, 10:05 AM IST
కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ గుర్తులు
తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీల వరద కాదు. సునామీని సృష్టిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి ప్రజాకూటమి, బీజేపీ, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్ఎస్ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హమీలు గుప్పించాయి. గుప్పిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యాయి. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, ఆసరా పెన్షన్లు ప్రస్తుతం ఉన్న దానికి డబుల్ చేయడం వంటి హామీలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ రూ.లక్ష వరకు చేస్తామని హామీ ఇచ్చింది. పెన్షన్లు, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామంది. దీంతో పాటు ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు కూడా బోలెడు డబ్బులు ఖర్చవుతాయి. పార్టీలు ఇచ్చిన హామీలన్నీ లెక్కేస్తే వాటిని అమలు చేయడానికి రూ.80వేల కోట్లు ఖర్చవుతుందని ఆంధ్రజ్యోతి పత్రిక అంచనా వేసింది.
పార్టీలు ఇస్తున్న హామీల ప్రకారం.. పెన్షన్లకు ఇస్తున్న ఖర్చు డబుల్ అవుతుంది. నిరుద్యోగ భృతి కూడా ఖర్చులో కలుస్తుంది. వీటికితోడు ఠంచనుగా చెల్లించాల్సినవి చాలా ఉంటాయి. ఉద్యోగులకు జీతాలు (ఏటా రూ.24,000 కోట్లు), పెన్షన్లు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం సుమారు రూ.88వేల కోట్లు. కొత్త హామీలకే రూ.80వేల కోట్లు ఖర్చయితే, మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం మీద రూ.60వేల కోట్ల అప్పు ఉంది. నాలుగున్నరేళ్లలో అది రూ.2.30 లక్షల కోట్లకు పెరిగింది. గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టాలి కాబట్టి, వాటి కోసం రూ.18,285 కోట్లు ఖర్చవుతుంది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 70వేల కోట్లు. రాష్ట్ర ఆదాయానికి, వ్యయానికి పొంతన లేదు. మరి కొత్తగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏం చేయాలి? అయితే, మళ్లీ కొత్తగా అప్పులు తీసుకురావాలి. లేకపోతే పన్నులు పెంచాలి. ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీలు పన్నుల జోలికి వెళతాయా? ఒకవేళ పన్నులు పెంచితేవేటి మీద వేస్తారు? అనే సందేహం సహజంగా కలుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మద్యాన్ని ఆదాయవనరుగా భావిస్తోంది. టార్గెట్లు పెట్టి మరీ మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఏటా టార్గెట్ కంటే ఎక్కువగానే మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ శాఖే అధికారికంగా ధ్రువీకరిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మద్యం మీద కూడా పన్నులు పెంచే అవకాశం లేకపోలేదు. దీంతో పాటు నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల మీద కూడా కచ్చితంగా పన్ను పోట్లు పడే ప్రమాదం కచ్చితంగా ఉంది.
పన్నులు వేస్తే జనాలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు కాబట్టి, వాటికి భయపడి సర్కారు అప్పులు తీసుకొస్తే అది రాష్ట్రం మీద మరింత గుదిబండగా మారుతుంది. ఇప్పటికే తెలంగాణ మీద రూ.2.30లక్షల కోట్ల అప్పు ఉంది. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే, సగటున ఒక్కొక్కరి మీద రూ.1.7లక్షల రుణభారం ఉంది. ఈ విషయాన్ని ప్రజాకూటమి తమ ఎన్నికల ర్యాలీల్లో హైలైట్ చేస్తోంది. అది ఇంకా పెరుగుతూ పోతే పరిస్థితి ఏంటి? అనేది ప్రధాన ప్రశ్న.
హామీలు అమలు చేయాలంటే తొలి బడ్జెట్లో ఎంత ఖర్చవుతుంది?
|
ప్రజాకూటమి (ఖర్చు రూ.కోట్లలో) |
టీఆర్ఎస్ (ఖర్చు రూ.కోట్లలో) |
రైతు రుణమాఫీ (ఒకేసారి చేస్తే) |
35,000 |
17500 |
రైతు బంధు |
15,000 |
15,000 |
ఆసరా పెన్షన్లు |
10,000 |
10,000 |
నిరుద్యోగ భృతి |
3,600 |
3,600 |
ఇళ్లు/డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు |
3,500 |
30,000 |
స్వయం సహాయక బృందాలు |
4,000 |
|
ఉచిత విద్యుత్ |
10,000 |
5,000 |
ఆరోగ్యశ్రీ, ఇతర ఆరోగ్య పథకాలు |
2,500 |
1,000 |
సబ్సిడీ బియ్యం |
3,,000 |
3,000 |
మొత్తం |
86,600 |
85,100 |
(Info Credit/AndhraJyothi)
అటు పన్నులు వేయకుండా, ఇటు అప్పులు తీసుకురాకుండా ప్రభుత్వం... ఇన్ని హమీలను ఎలా నెరవేర్చగలదు. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. అంటే, పథకాల లబ్ధిదారుల్లో కోత అయినా పెట్టాలి. లేకపోతే సవాలక్ష కండిషన్లు అయినా విధించాలి. ఇవన్నీ పరిశీలిస్తే, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా.. అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఆషామాషీ మాత్రం కాదు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 30, 2018, 10:05 AM IST