news18-telugu
Updated: December 8, 2018, 4:48 PM IST
ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)
తెలంగాణ ఎన్నికల తర్వాత ఈవీఎంల భద్రతపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, లేదా రీప్లేస్ చేసే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు రవాణా అవుతున్నప్పుడు, స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినప్పుడు, వాటిని బయటకు తీసినప్పుడు కార్యకర్తలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత అధికారులు కూడా అందులోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. కానీ, అధికారులు లోపలికి వెళ్తున్నారని తమకు సమాచారం వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒకవేళ అక్క డ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిని పర్యవేక్షించే దగ్గర పార్టీల ఏజెంట్లను కూడా కూర్చోవడానికి అనుమతివ్వాలని ఈసీని కోరారు. ఎలక్షన్ కమిషన్ చాలా విషయాల్లో విఫలమైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్షల మంది ఓట్లు గల్లంతు అయినందుకు సాక్షాత్తూ సీఈవో రజత్ కుమార్ క్షమాపణ చెప్పిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ ప్రస్తావించారు. ఓటర్ల జాబితా సరిగా సిద్ధం చేయకుండా హడావిడిగా ఎన్నికలు నిర్వహించారని ఉత్తమ్ విమర్శించారు.
ఈనెల 12న తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల ఓట్లు ఆయా పార్టీల అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ అయ్యాయని తమ గెలుపు ఖాయమన్నారు. ప్రజాకూటమికి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఉత్తమ్ జోస్యం చెప్పారు. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, ఇప్పుడు 80 సీట్లు అంటున్నారని, ఫలితాల రోజు వారికి 30 సీట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ 5-0 తేడాతో గెలవడం ఖాయమని ఉత్తమ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 8, 2018, 3:33 PM IST